బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం: నేడు స్కూళ్లకు సెలవు
Bay of Bengal: వరుస అల్పపీడనాలు, తుఫాన్లు తాకిడి కొనసాగుతూ వస్తోంది. ఒకదాని వెంట ఒకటిగా అల్పపీడనాలు ఏర్పడుతూనే ఉన్నాయి దాదాపు రెండునెలల నుంచి. ప్రతి సంవత్సరం నవంబర్/డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటం సహజమే అయినప్పటికీ- ఇప్పుడు దీని తీవ్రత మరింత పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర అల్పపీడనంగా రూపు దాల్చింది. ఇది వాయుగుండంగా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వచ్చే 24 నుంచి 48 గంటల్లో వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది.

దీని ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై సహా కడలూరు, మైలాడుథురై, నాగపట్నం, కరైకల్, చెంగల్పట్టు, విల్లుపురంలల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తిరువారూరు, తంజావూరు, కాళ్లకురిచ్చి, అరియలూర్, పెరంబలూర్, తిరుచిరాపల్లి, పుదుక్కోట్టై, రామనాథపురం, శివగంగ, తూత్తుకూడి జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తోన్నాయి.
వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. చెన్నై సహా 10 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది. చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలాడుథురై, పుదుక్కోట్టై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువారూరు, రాణిపేట, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలు నేడు తెరచుకోవు.
ఆయా జిల్లాలన్నింటితో పాటు కాంచీపురానికీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఈ నెల 14వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ హెచ్చరించింది.
గత 24 గంటల వ్యవధిలో ఆదిరామపట్నం, విరుధాచలం, నాగపట్నం, తిరువారూర్, కడలూరు, పూనమల్లి, చెన్నైలోని రెడ్ హిల్స్ ఏరియాలో అత్యధికంగా ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నుంగంబాక్కంలో 7 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది.












Click it and Unblock the Notifications