మార్పు కోసం ఆత్మహత్య : ఇది ఓ ప్రకృతి ప్రేమికుడి ఆవేదన!
తిరుచ్చి : గ్లోబలైజేషన్ పర్యావరణానికి ఎంతటి ముప్పుగా పరిణమించిందో.. దాని దుష్ఫలితాలేంటో ప్రస్తుతం ఇండియా అనుభవిస్తూనే ఉంది. అయినా దానిపై నియంత్రణ తీసుకొచ్చే దిశగా ఏ ఒక్కరూ ఆలోచించకోకపోవడం.. భవిష్యత్తులో ఇండియాకు పెనుముప్పుగా పరిణమించవచ్చు. సరిగ్గా ఇలాంటి ఆలోచనలే ఉన్న జవహర్ అనే 23 ఏళ్ల యువకుడు పర్యావరణ పరిరక్షణ కోసం ఏదో ఒకటి చేయాలని నిత్యం తపించిపోయేవాడు.
ఆఖరికి తన ప్రాణాన్ని త్యాగం చేసైనా సరే.. ఈ సమాజంలో ఒక ఆలోచనను రగిలించి కొంత మార్పు తీసుకురావాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే పర్యావరణ పరిరక్షణ కోసం, ప్లాస్టిక్ నిషేధం కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకృతిపై మనిషి చేస్తోన్న దాడిని తట్టుకోలేకపోయిన జవహర్.. సమాజంలో మార్పు కోసం ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రకృతిపై అమితమైన ప్రేమను పెంచుకున్న జవహర్.. ప్లాస్టిక్ నిషేధం కోసం తనవంతుగా చాలానే ప్రచారం నిర్వహించాడు. పచ్చని పంట పొలాలను నాశనం చేస్తూ.. అర్బనైజేషన్ ను పెంచుకుంటూ పోతే భవిష్యత్తులో తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఎప్పుడూ హెచ్చరిస్తుండేవాడు జవహర్. ఇదే విషయాన్ని జవహర్ ఆత్మహత్య అనంతరం అతని తండ్రి భోరున విలపిస్తూ చెప్పాడు. పర్యావరణ పరిరక్షణ కోసం త్యాగానికైనా సిద్దమని అతను అన్నప్పుడు.. జవహర్ ఇలా ప్రాణ త్యాగం చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు.

తంజావూరుకు చెందిన జవహార్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చాలానే కార్యక్రమాలు నిర్వహించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పలుమార్లు ధర్నాలతో రోడ్డెక్కి మరీ ప్లాస్టిక్ నిషేధంపై గొంతెత్తాడు జవహర్. ప్రకృతిని ఎంతలా రక్షించుకుంటే.. అది మనల్ని అంతలా కాపాడుతుందని జవహర్ ఎప్పుడూ చెబుతుండేవాడని తంజావూరు ప్రజలు చెబుతున్నారు.
'పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ పై నిషేధం తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చేసుకుంటున్నాను. 127కోట్ల పైచిలుకు జనాభా ఉన్న దేశంలో వారందరి మేలు కోరి నేను ప్రాణత్యాగం చేసుకోవడంలో తప్పులేదు. ఈ నిర్ణయం వెనుక ఎవరి ప్రోద్బలం లేదు. ప్రకృతికి విరుద్ధంగా జీవించడమనేది అసాధ్యం. కానీ, మనుషులు సహజ వనరులను నాశనం చేస్తూ పోతున్నారు. ఇలాంటి తరుణంలో నేను ప్రేక్షకుడిలా ఉండదల్చుకోలేదు' అంటూ ఆత్మహత్యకు ముందు తన మరణ వాంగ్మూలాన్ని తన మొబైల్ కెమెరా ద్వారా రికార్డు చేశాడు జవహర్.
జవహర్ ఆత్మహత్య అనంతరం అతని వద్ద లభించిన సెల్ ఫోన్ లో ఈ వీడియో ఉన్నట్లుగా అతని తండ్రి కుమారన్ తెలిపారు. సమాజంలో మార్పు తీసుకురావడం కోసం తన కొడుకు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటానని తాను భావించలేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు ఆ తండ్రి.












Click it and Unblock the Notifications