తమిళనాడులో రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక పోలింగ్.. మరికొద్దిగంటల్లో ప్రారంభం
తమిళనాడులోని మదురాంతకం (ఎస్సీ), ధారాపురం (ఎస్సీ) నియోజకవర్గాలకు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సంబంధిత జిల్లాల యంత్రాంగం స్థానిక సెలవును ప్రకటించింది. ప్రశాంతంగా, సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇక ఇవాళ ఓటింగ్ ప్రక్రియ పూర్తికానుండగా, అక్టోబర్ 9 వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలను వెల్లడించనున్నారు.
తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ టీవీకే ప్రభుత్వానికి ఇవి తొలి ఉప ఎన్నికలు కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాగే ఈ ఉప ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేవలం నాలుగు నెలలకే ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు రావడంతో.. కొత్త ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న మద్దతును అంచనా వేసే తొలి ప్రత్యక్ష ఎన్నికగా వీటిని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. అయితే మదురాంతకం నుంచి అప్పటి అన్నాడీఎంకే ఎమ్మెల్యే కే. మారగతం కుమారవేల్.. ధారాపురం నుంచి పీ. సత్యభామ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం ఇద్దరూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరారు. దీంతో ఈ రెండు స్థానాలు ఖాళీ కావడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

ఇక సీఎం విజయ్ ఈ రెండు ఉప ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మదురాంతకం, ధారాపురం నియోజకవర్గాల్లో వరుసగా నాలుగు రోజుల పాటు ఆయన విస్తృతంగా పర్యటించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు అభిమానులు, ఓటర్ల నుంచి విశేష స్పందన రాబట్టారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పట్టునిలుపుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ఆరాటపడుతున్నాయి. ఈ రెండు అసెంబ్లీ స్థానాలను తిరిగి దక్కించుకోవాలని అన్నాడీఎంకే తీవ్రంగా శ్రమించింది. ఇక ఉప ఎన్నికలపై టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య తీవ్ర స్థాయిలో త్రిముఖ పోరు నెలకొనడంతో రేపటి పోలింగ్ పై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications
