తనిష్క్ నగల దోపిడీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇన్ స్టాగ్రామ్ సెలెబ్రిటీ మీనాక్షి అరెస్ట్..
తమిళనాడులోని మదురై నగరంలో ఇటీవల ప్రారంభమైన తనిష్క్ జ్యూవెలరీ షోరూమ్ లో రెండు రోజుల క్రితం భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. షో రూమ్ వెనకనుంచి చొరబడిన దుండగులు రూ. 50 కోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దొంగతనం కేసులో.. ప్రముఖ యూట్యూబర్, ఇన్ ఫ్లుయెన్సర్ మీనాక్షి నాచియార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను దాచిపెట్టడంలో సహకరించారన్న ఆరోపణలతో మీనాక్షిని మధురై సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ చోరీకి ప్రధాన సూత్రధారి అయిన యూట్యూబర్ నిషాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో బంగారం దోపిడీలో మీనాక్షి హస్తం కూడా ఉన్నట్లు స్పష్టమైంది. దొంగలించిన నగలను దాచిపెట్టమని మీనాక్షికి నిషాంత్ ఇచ్చినట్టు కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే కొంత బంగారాన్ని నిషాంత్ తన తండ్రి సురేశ్ కు కూడా ఇచ్చినట్లు తేలింది. అయితే బంగారాన్ని మదకులమ్ అటవీ ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో దాచిపెట్టినట్లు వచ్చిన సమాచారం మేరకు మీనాక్షీను బంగారం దాచి పెట్టిన ప్రదేశానికి తీసుకెళ్లారు పోలీసులు. ఇప్పటి వరకూ నిందితుల నుంచి 5 నుంచి 6 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసుపై విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణను పూర్తి చేసి త్వరలోనే మిగతా బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని వివరించారు.

ఇక నవంబర్ 10 న రాత్రి ఎప్పటిలాగే షో రూమ్ సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. అయితే మరుసటి ఉదయం వచ్చి చూసేసరికీ షాపులో దోపిడీ జరిగినట్లు గుర్తించారు. దాదాపు రూ. 50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications
