సీఎం పర్సనల్ సెక్రటరీ పేరుతో మోసాలు... కరీంనగర్‌లో యువకుడి అరెస్ట్...
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్సనల్ సెక్రటరీనంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ యువకుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఎం కార్యాలయానికి చెందిన రాజశేఖర్ రెడ్డి పేరు మీద అతను నకిలీ నియామకపు ఉత్తర్వులు సృష్టించినట్లు గుర్తించారు. ఇటీవలి కాలంలో అతను పలువురిని బెదిరించి భయభ్రాంతులకు గురిచేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, మొగిలిపాలెం గ్రామానికి చెందిన సాయి చందన్ కరీంనగర్‌లోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్న అతను సీఎం పర్సనల్ సెక్రటరీని అని ప్రచారం చేసుకున్నాడు. సీఎం అడిషినల్ సెక్రటరీగా ముఖ్యమంత్రి కుటుంబ వ్యవహారాలను చూసుకుంటున్నానని,కరీంనగర్ జిల్లా అవినీతి నిరోధక విభాగం ఛైర్మన్‌గా ఉన్నానని చెప్పుకున్నాడు. సీఎం కార్యాలయానికి చెందిన రాజశేఖర్ రెడ్డి పేరు మీద నకిలీ నియామకపు ఉత్తర్వులు కూడా సృష్టించుకున్నాడు.

ఇదే క్రమంలో పలువురి వద్ద డబ్బులు గుంజేందుకు ప్రయత్నించి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. దీనిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి అతని కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో శనివారం అతన్ని కరీంనగర్‌లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అవినీతి నిరోధక శాఖ ఛైర్మన్ అని చెప్పుకుంటూ పలువురిని భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్దారించారు. విచారణలో మరిన్ని మోసాలు బయటపడే అవకాశం ఉంది.