బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు: అరెస్ట్

ఉపాధ్యాయుని వేధింపులు, అరెస్ట్ విషయాన్ని పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచుతోంది. అయితే డిసిపి కరుణాకరణ్ మాత్రం నిందితున్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితునిపై లైంగిక వేధింపులు, లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితున్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఐదవ తరగతి చదువుతున్న పదేళ్ల బాలిక సోమవారం పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించి, కన్నీటి పర్యాంతమవడంతో ఆమెను తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో ఆ బాలిక ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వారు పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత పాఠశాల యాజమాన్యాన్ని ఈ విషయంపై నిలదీశారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై విచారించారు. ఓ ఎన్‌జిఓ సంస్థ సహకారంతో బాలిక నుంచి ఫిర్యాదు సేకరించారు. ఆ బాలికతోపాటు మరో నలుగురు బాలికలు కూడా తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. తమతో ఆ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించేవాడని చెప్పారు. ప్రశ్నలు అడిగి చెప్పలేదనే నెపంతో తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలికలు ఫిర్యాదు చేశారు.
వేధింపుల విషయాన్ని ఎవరికైనా చెప్పినట్లయితే పరీక్షలో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని బాలికలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. పాఠశాలలో ఇంత జరుగుతున్నా ఎవరికీ తెలియకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications