టెక్కీ రేప్, హత్య: నిందితులను పట్టించిన ఏటిఎం కార్డ్

అరెస్ట్‌కు ముందు హత్య కేసులో నిందితుడైన ఉత్తమ్ మండల్ బాధితురాలు ఉమా మహేశ్వరికి సంబంధించిన ఏటిఎం కార్డుతో చెన్నైలోని సిరుసెరిలోని ఏటిఎం కేంద్రంలో డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతనికి ఏటిఎం పిన్ తెలియకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. ఏటిఎంలో అమర్చిన సిసి కెమెరాల ద్వారా ఉత్తమ్ మండల్‌ను గుర్తించినట్లు సిబి-సిఐడి ఐజి మహేష్ కుమార్ అగర్వాల్ తెలిపారు.
ఆ తర్వాత ఉత్తమ్ మండల్ బాధితురాలి క్రెడిట్‌తో ఓ బట్టల దుకాణంలో కొనుగోలు చేస్తుండగా ఆ దుకాణంలోని సిసి కెమెరాల్లో కూడా చిక్కినట్లు ఆయన చెప్పారు. నిందితుల గుర్తింపులో మానవరహిత వాహనం కూడా చాలా ఉపయోగపడిందని ఆయన తెలిపారు. పలు ఆధారాలు సేకరించడంలో ఈ వాహనం సహాయపడిందని ఆయన తెలిపారు. ఈ ఆధారాలన్నంటినీ క్రోడీకరించి నిందితులను పట్టుకున్నామని ఆయన తెలిపారు.
కాగా బాధితురాలు ఉమా మహేశ్వరి (24) మృతదేహాన్ని చెన్నై సమీపంలోని స్పికోట్ ఐటి పార్క్ వద్ద గత శనివారం పోలీసులు గుర్తించారు. హత్యపై దర్యాప్తు జరిపిన పోలీసులు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఉత్తమ్ మండల్ (24), రామ్ మండల్ (21)లను మూడు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు నిందితులిచ్చిన సమాచారం మేరకు మూడో నిందితుడైన ఉజ్జల్ మండల్‌ను కోల్‌కతాలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications