కాంగ్రెసు వ్యూహం: తెలంగాణపై ఫిక్స్‌లో పడిన బిజెపి

తెలంగాణ బిల్లుకు సహకరించబోమని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ, తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టలేదని సుష్మా స్వరాజ్ చేసిన ప్రకటనలతో వివాదం చెలరేగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అండ చూసుకుని బిజెపి తెలంగాణపై తన వైఖరిని మార్చుకుందనే విమర్శలు రావడం ప్రారంభమైంది. తెలంగాణపై బిజెపి యూటర్న్ తీసుకుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ వ్యాఖ్యానించారు కూడా.
నిజానికి, కాంగ్రెసు తెలంగాణ బిల్లు విషయంలో సురక్షిత స్థాయికి చేరినట్లే లెక్క. బిజెపి మద్దతు ఇస్తామని చెప్పడం వల్లనే బిల్లును తెచ్చామని యుపిఎ ప్రభుత్వం చెప్పే అవకాశాలున్నాయి. బిజెపి కారణంగా లోకసభలో బిల్లు వీగిపోతే కాంగ్రెసుకు నష్టం లేకపోగా, లాభం చేకూరే అవకాశాలున్నాయి. నింద మొత్తం బిజెపిపై వేయడానికి అవకాశం లభిస్తుంది.
ఈ పరిస్థితిలో అద్వానీ, సుష్మా స్వరాజ్ ప్రకటనలు చేసే నష్టాన్ని గమనించిన తెలంగాణ బిజెపి నేతలు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వద్దకు వెళ్లారు. తమ పరిస్థితిని విన్నవించుకున్నారు. దాంతో రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగి గురువారం సాయంత్రం ప్రకటన చేయాల్సి వచ్చింది. శుక్రవారంనాడు లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ తెలంగాణపై వివరణలు ఇచ్చుకున్నారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పుకున్నారు.
నిజానికి, ప్రస్తుత స్థితిలో తెలంగాణ బిల్లును ఆమోదిస్తే చాలుననే అభిప్రాయంతో అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులున్నారు. బిల్లు ఆమోదం పొందకపోతే జరిగే పరిణామాలు ఏమిటో వారికి తెలుసు. బిల్లు బిజెపి కారణంగా ఆమోదం పొందకపోతే, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలంగాణ ప్రాంతంలో దున్నుకుంటాయి. ఆ మేరకు బిజెపికి, తెలుగుదేశం పార్టీకి నష్టం జరగుతుంది.
ప్రస్తుత వాతావరణంలో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వడం తప్ప ప్రత్యామ్నాయం లేని స్థితిలో బిజెపి చిక్కుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ అనుకూల వైఖరి వల్ల పాజిటివ్ ఓటు తమకు పడే అవకాశాలున్నాయని, ఇంకా కొంత మంది నాయకులు పార్టీలో చేరే అవకాశం ఉందని తెలంగాణ నేతలు భావిస్తున్నారు. దీంతో జాతీయ నాయకత్వంపై బిల్లు ఆమోదానికి ఒప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications