తెలంగాణ-వరంగల్: కులాంతర వివాహం చేసుకున్న వరుడి ఇంటిని రాత్రికి రాత్రే తగులబెట్టారు...

కులాంతర వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని రాత్రికి రాత్రే తగులబెట్టారు దుండగులు. అంతేకాదు, ఆ యువకుడి సన్నిహితులైన మరో ముగ్గురి ఇళ్లకూ నిప్పు పెట్టారు.
ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట్ మండలం ఇటికాలపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది.
దీని వెనుక గ్రామ సర్పంచ్ హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.
నర్సంపేట్ పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం., ఇటికాలపల్లి గ్రామ సర్పంచ్ మండలం రవీందర్ కూతురు కావ్య 'హసన్‌పర్తి'లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు.
కావ్య, అదే గ్రామానికి చెందిన రజక కులానికి చెందిన రంజిత్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రంజిత్ వరంగల్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు.
గత నెలలో వివాహం..
అయితే, 2023 జూన్‌లో కుటుంబ సభ్యులకు తెలియకుండా కావ్య, రంజిత్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు.
కూతురు కులాంతర ప్రేమ వివాహంపై సర్పంచ్ రవీందర్ వారం క్రితం గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. కూతురిని గ్రామానికి రప్పించేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో తాను రంజిత్‌ను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానంటూ కావ్య తన తల్లిదండ్రులను ఉద్దేశించి ఓ వీడియో సందేశం పంపారు.
'నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నా. నన్ను ఎవరూ బలవంత పెట్టలేదు. నా వల్ల ఇబ్బంది పడొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. తనతో హ్యాపీగానే ఉన్నాను. నా కోసం ఎక్కడా వెతక్కండి. మీరు సంతోషంగా ఉండి, నన్నూ ఉండనివ్వండి’ అని కావ్య వీడియోలో కోరారు.
దీంతో జూన్ 30న తన కూతురు కనిపించడం లేదని హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో కావ్య తండ్రి రవీందర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
'కావ్య తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు విచారణలో భాగంగా కావ్య, రంజిత్‌లను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాం. తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, తన భర్త రంజిత్‌తోనే కలిసి ఉంటానని చెప్పడంతో అతనితోనే పంపించాం’ అని హసన్‌పర్తి ఎస్సై సురేష్ బీబీసీకి తెలిపారు.

రాత్రికి రాత్రే ఇళ్లకు నిప్పు..
కాగా, బుధవారం తెల్లవారుజామున రంజిత్ ఇంటితో పాటు మరో మూడు ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. ఘటనలో మొత్తం నాలుగు ఇళ్లు కాలిపోయాయి. ప్రేమ పెళ్లికి సహకరించారనే అనుమానంతోనే వారి ఇళ్లకు నిప్పు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇళ్లు కాలిన ఘటనపై నర్సంపేట పోలీసులు బీబీసీతో మాట్లాడారు.
'ఈ రోజు తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నాం. దర్యాప్తు చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయి’ అని నర్సంపేట్ సీఐ రమేష్ తెలిపారు.
ఈ ఘటన తర్వాత ఇటికాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
'ఈ ఘటనలో అందరూ బీసీ కులాలకు చెందిన వారే ఉన్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది’ అని నర్సంపేట్ ఏసీపీ సంపత్ రావ్ బీబీసీతో తెలిపారు.
గ్రామంలో ఇళ్లకు నిప్పు పెట్టడంతో తమకు ప్రాణహాని ఉందంటూ కావ్య, రంజిత్‌ల జంట వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి
- కట్నం: పెళ్లిళ్లు జరిగే చోట తనిఖీలు జరపాలని ఈ యువతి ఎందుకు కోరుతున్నారు?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications