వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: బాయిల్డ్ రైస్‌, రా రైస్ మధ్య తేడా ఏమిటి? కేంద్రంతో కేసీఆర్ ప్రభుత్వ వివాదం ఏమిటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బియ్యం

తెలంగాణలో ప్రస్తుతం యాసంగి (రబీ) ధాన్యం పంట చేతికొచ్చింది. వరి కోతలు ఆరంభమయ్యాయి. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇటు తెలంగాణ అటు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతోంది. ఇకపై పార్బాయిల్డ్ రైస్‌ కొనబోమని కేంద్రం చెబుతుంటే, తెలంగాణలో పండిన పంట అంతా కొనాల్సిందే అంటూ పాలక టీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది.

ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

కేంద్రం యాసంగి ధాన్యం కొనబోమని చెప్పిందనడం అవాస్తవమని, వానాకాలం మాదిరిగానే సేకరిస్తుందని ఆయన చెప్పారు

మరోవైపు తెలంగాణలో చివరి ధాన్యం గింజ కొనే వరకు రైతులకు అండగా ఉంటామని కాంగ్రెస్ చెబుతోంది.

బియ్యం

ధాన్యం కొనుగోలులో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటని, రైతులను క్షోభపెట్టే పనులు మానుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

మరోవైపు- వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఉంటుందా, లేదా అనే ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో, బాయిల్డ్ రైస్ అంటే ఏమిటి, పార్బాయిల్డ్ రైస్ , రా రైస్ మధ్య తేడాలు ఏమిటో చూద్దాం.

వరి

అన్నపాత్రగా తెలంగాణ

ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.

సాగునీటి లభ్యత పెరగడం, 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరా లాంటి కారణాల వల్ల వరి సాగు విస్తీర్ణం పెరిగింది. గత సీజన్‌లో ధాన్యం ఉత్పత్తి రికార్డ్ స్థాయిలో కోటి టన్నులకు చేరింది. వరి ప్రధానంగా ఖరీఫ్ సీజన్ పంటే అయినా ఇక్కడి అనుకూల పరిస్థితులతో రబీలో కూడా ఎక్కువగా రైతులు సాగు చేస్తున్నారు.

తెలంగాణలో రబీ సీజన్ (యాసంగి)లో పండే ధాన్యం ముడి బియ్యం(రా రైస్) ఉత్పత్తికి అనుకూలంగా ఉండదు. గత రెండు దశాబ్దాలకు పైగా బాయిల్డ్ రకం బియ్యం ఇక్కడ ఉత్పత్తి అవుతోంది.

ఈ బియ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఆహార ధాన్యాల పంపిణీ కోసం సేకరించాయి కూడా. మారుతున్న ఆహార అలవాట్ల రీత్యా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ తగ్గడం, గోడౌన్లలో ఇప్పటికే ఆ నిల్వలు పేరుకుపోయిన పరిస్థితుల్లో ఇక ముడి బియ్యం(రా రైస్) సేకరిస్తామని కేంద్రం చెబుతోంది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిందని, రానున్న రోజుల్లో పార్బాయిల్డ్ రైస్ సరఫరా చేయబోమని తెలంగాణ ప్రభుత్వం లేఖ రూపంలో హామీ ఇచ్చిందని 2021 డిసెంబర్‌లోరాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన చేశారు.

కేంద్రం నిర్ణయం రబీ సీజన్ పరంగా చూస్తే తెలంగాణ రైతులకు నష్టం కలిగిస్తుందని, యాసంగి పంట కొనుగోళ్లు లేకపోతే మద్దతు ధర దక్కని పరిస్థితులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.. రబీలో రాష్ట్రంలో పండే వరి ధాన్యంతో పార్బాయిల్డ్ విధానంలో మాత్రమే నూకలు లేకుండా బియ్యం ఉత్పత్తి సాధ్యం అవుతుందంటోంది.

రైతులు

ఆహార భద్రత-ప్రజా పంపిణీ వ్యవస్థ

దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధరను అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం రూపొందించిన 'ఫుడ్ కార్పోరేషన్ యాక్ట్-1964 లో భాగంగా 'భారత ఆహార సంస్థ( ఎఫ్‌సీఐ) ఏర్పాటైంది.

ఎఫ్‌సీఐ ప్రధానంగా బియ్యం, గోధుమలను ఆయా రాష్ట్రాల నుంచి సేకరించి తన గోడౌన్లలో భద్రపరుస్తుంది. బియ్యం సేకరణ ఎక్కువగా పంజాబ్, హరియాణా,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి చేస్తోంది.

ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాప్)లో భాగంగా ప్రతి నెల రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ రూపంలో తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013, టీపీడీఎస్ (టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం) కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు దీనివల్ల లబ్ధి చేకూరుతోంది.

ప్రస్తుతం ఎఫ్‌సీఐ ద్వారా ముడి బియ్యం మాత్రమే సేకరిస్తామన్న కేంద్ర నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ధాన్యం

ప్రత్యామ్నాయ పంటల సాగు-రబీలో ఆశించిన మేర తగ్గని వరి సాగు

ధాన్యం సేకరణలో కేంద్రం తన విధానం స్పష్టం చేయడంతో, భవిష్యత్తులో రబీ ధాన్యం సేకరణలో ఎదుర్కోబోయే ఇబ్బందుల దృష్ట్యా, యాసంగిలో వరి బదులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది.

క్రాప్ డైవర్సిఫికేషన్ (పంటల వైవిధ్యీకరణ) ప్రోత్సాహాల్లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. పప్పు దినుసులు, నూనెగింజలు, అపరాలు, కూరగాయలవంటి ఇతర పంటలు సాగుచేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

తొలి రోజుల్లో యాసంగి వరి సాగును నియంత్రించేందుకు ప్రయత్నించింది. అయితే ఆశించిన మేర వరి విస్తీర్ణం తగ్గలేదు. 2020-2021 రబీలో తెలంగాణలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈసారి 36 లక్షల ఎకరాల్లో వేశారని అంచనా.

ప్రత్యామ్నాయ పంటలు అమ్ముకునేందుకు మార్కెటింగ్, మద్దతు ధర వంటి అంశాలపై అనుమానాలు, మరోవైపు సాగునీరు, ఉచిత వ్యవసాయవిద్యుత్ వంటి అనుకూల పరిస్థితుల్లో రైతులు వరి వైపే మొగ్గుచూపారని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రా రైస్, పారాబాయిల్డ్ రైస్

మామూలు మాటల్లో చెప్పాలంటే- ధాన్యాన్ని నేరుగా మిల్లింగ్ చేస్తే వచ్చే బియ్యాన్ని రా రైస్ లేదా ముడిబియ్యంగా వ్యవహరిస్తారు. ధాన్యం ఉడికించి ఆ తర్వాత మిల్లింగ్ చేస్తే దాన్ని బాయిల్డ్ రైస్‌గా పిలుస్తారు. తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌లో పండే ధాన్యంతో ముడి బియ్యం, రబీ(యాసంగి) ధాన్యంతో బాయిల్డ్ రైస్ ఉత్పత్తి జరుగుతోంది.

రబీలో స్థానికంగా ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా 'బాయిల్డ్ రకం' బియ్యం ఉత్పత్తికే పండిన ధాన్యం అనుకూలంగా ఉంటుందని, ముడి బియ్యంగా మారిస్తే నూకల శాతం ఎక్కువగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం.

"బాయిల్డ్ రైస్‌ తయారీలో భాగంగా ధాన్యాన్ని మిల్లింగ్ చేసే ముందు 85-90 డిగ్రీల నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద వేడి నీటిలో ఉడికించి, ఆరబోశాక 15 శాతం తేమ వద్ద మిల్లింగ్ చేస్తాం. అప్పుడు బియ్యంలో నూక శాతం తగ్గుతుంది. అదే రా రైస్ చేస్తే ,బియ్యం 20 శాతానికి మించి రాదు'' అని కరీంనగర్ జిల్లా బొమ్మకల్ కు చెందిన రైస్ మిల్లు నిర్వాహకుడు గుండే రావ్ బీబీసీతో చెప్పారు.

"తెలంగాణలో యాసంగి పంట కోతల సమయంలో 35-44 డిగ్రీ సెంటీగ్రే‌డ్‌ల వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. గాలిలో తేమ కూడా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా రాత్రి వేళల్లో గింజ తేమను స్వీకరించడం,పగటి పూట ఆ తేమ త్వరగా ఆవిరవడం వల్ల గింజలో పగుళ్లు ఏర్పడతాయి. దీంతో మిల్లింగ్ సమయంలో నూక ఎక్కువగా వస్తుంది. ఖరీఫ్‌లో పండే ధాన్యంతో పోలిస్తే 15-20 శాతం అధికంగా నూక అవుతుంది'' అని జమ్మికుంట 'కృషి విజ్ఞాన కేంద్రం' సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. వెంకటేశ్వర్ రావ్ బీబీసీకి వివరించారు.

కస్టమ్ మిల్లింగ్ రైస్

గతంలో కేంద్రం ఎఫ్సీఐ ద్వారా ఆయా రాష్ట్రాల్లో సేకరించిన ధాన్యాన్ని లెవీ విధానంలో స్థానిక రైస్ మిల్లులో బియ్యం పట్టించి గోడౌన్లకు తరలించేది. ఆ తర్వాత రాష్ట్రాల సహకారంతో సేకరణ చేస్తోంది. కస్టమ్ మిల్లింగ్ లో భాగంగా క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల బియ్యం మిల్లర్లకు ఇవ్వాలన్నది లక్ష్యం.

బియ్యం పోగా మిగిలిన అనుబంధ ఉత్పత్తులైన నూకలు, ఊక, తవుడుతోపాటు కొంత మొత్తం కస్టమ్ మిల్లింగ్ ఛార్జ్ కింద రైస్ మిల్లర్లకు చెల్లిస్తారు.

గతంలో, ఖరీఫ్ సీజన్ ధాన్యంతో నిర్ధేశించిన మొత్తంలో (67 కిలోలు) ముడి బియ్యం రాగా అదే ఖరీఫ్ ధాన్యం మిల్లింగ్ చేసే సందర్భంలో నూకలు ఎక్కువ శాతం రావడంతో 'పారా బాయిల్డ్ మిల్లింగ్ విధానం తెరపైకి వచ్చింది.

"యాసంగి ధాన్యం మిల్లింగ్ లో వచ్చే బియ్యం 50 శాతం దాటదు. బ్రోకెన్ రైస్ బాగా పెరుగుతుంది, నూకలు30-40 శాతం వస్తాయి. నూకల శాతం ఎక్కువయితే ఎఫ్ సీఐ కస్టం మిల్లింగ్ సూచించిన మొత్తంలో బియ్యాన్ని అందించలేము. అందుకని యాసంగిలో నూక తగ్గేందుకు వడ్లను బాయిల్డ్ చేస్తే బియ్యం గింజ గట్టిగా ఉండి బ్రోకెన్ రైస్ తగ్గుతుంది. ఈ బాయిల్డ్ రైస్ విధానం దాదాపు 15 ఏళ్ల ముందు నుంచి అవలంబిస్తున్నాం''అని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ బీబీసీకి తెలిపారు.

వరి సాగు

గతంలో దేశ ఆహార అవసరాల రీత్యా బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌ను ప్రభుత్వాలు ప్రోత్సహించాయని రైస్ మిల్లర్లు అంటున్నారు.

"తెలంగాణలో రబీలో పండే ధాన్యం ముడి బియ్యంగా మర ఆడిస్తే విరిగి పోయి నూకలు వస్తాయి. దీన్ని అధిగమించేందుకే పార్బాయిల్డ్ రైస్ మిల్లులు 1980ల నుంచి వచ్చాయి. అప్పట్లో దేశ ప్రజల ఆహార అవసరాలకు బియ్యం ఎక్కువగా అవసరం అయ్యాయి. దీంతో ప్రభుత్వం బాయిల్డ్ రైస్ మిల్లుల ఏర్పాటును ఎంకరేజ్ చేసింది. తక్కువ శాతం వడ్డీలకు బ్యాంకు రుణాలను ఇప్పించింది'' అని రైస్ మిల్లు నిర్వాహకుడు గుండే రావ్ చెప్పారు.

ఒకప్పుడు కేరళ, తమిళనాడు,అస్సాం, పశ్ఛిమబెంగాల్‌తో పాటు పొరుగు దేశాలు శ్రీలంక,బంగ్లాదేశ్‌లలో బాయిల్డ్ రైస్ వినియోగం ఎక్కువగా ఉంది.

"బాయిల్డ్ రైస్ వినియోగం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అంతగా లేదు. రా రైస్‌తో పోలిస్తే ఇది పోషకాలతో కూడుకున్నది. ఈ బియ్యం ఎక్కువగా వాడే తమిళనాడు, కేరళలలో వరి ఉత్పత్తి పెరగడంతో అవి బయటి రాష్ట్రాలపై ఆధారపడటం తగ్గింది. గతంతో పోలిస్తే బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ తగ్గింది.

స్టీమింగ్ టెక్నాలజీ ఆధారిత రైస్ మిల్లుల ద్వారా రబీ ధాన్యం లో నూకల శాతం కొంతమేర తగ్గించే అవకాశం ఉంది. అయితే ఆ రకం మిల్లులు తక్కువగా ఉన్నాయి. యాసంగిలో తక్కువ నూకను ఇచ్చే వరి వంగడాల రూపకల్పనకు పరిశోధనలు మొదలయ్యాయని జమ్మికుంట కేవీకే( కృషి విజ్ఞాన కేంద్రం) హెడ్, సీనియర్ సైంటిస్ట్ ఎన్. వెంకటేశ్వర్ రావ్ తెలిపారు.

"మద్దతు ధర జాబితాలో ఉంది కాబట్టే, మద్దతు ధరతో కొంటారన్న విశ్వాసంతోనే యాసంగి లో రైతులు వరి సాగు చేశారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుని రైతులను రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దయచేసి మానుకోవాలి. పునరాలోచన చేసి యాసంగి వరి పంటను కొనేలా చర్యలు చేపట్టాలి'' అని జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telangana: What is the difference between boiled rice and raw rice? What is the KCR government dispute with the Center
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X