ఆ రోజు ఉగ్రవాదులు నన్ను చంపేసేవారే, కానీ..: కేంబ్రిడ్జిలో రాహుల్ గాంధీ
జమ్మూకాశ్మీర్‌లో తనకు ఎదురైన భయానక అనుభవం గురించి వెల్లడించారు రాహుల్ గాంధీ.
లండన్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. అయితే, జమ్మూకాశ్మీర్‌లో తనకు ఎదురైన భయానక అనుభవం గురించి వెల్లడించారు. యాత్ర సమయంలో ఉగ్రవాదులో తనను చంపేసేవారే అని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఉగ్రదాడులు జరిగే ముప్పు ఉందన్నా ముందుకే కదిలా: రాహుల్
లండన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో 21వ శతాబ్దంలో లెర్నింగ్ టు విజన్ అనే అంశంపై రాహుల్ ప్రసంగిస్తూ ఈ మేరకు విషయాలను పంచుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లో తాను తన పాదయాత్రను కొనసాగిస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఉగ్రదాడులు జరిగే ముప్పు ఉందని.. అక్కడ పాదయాత్ర చేయొద్దని భద్రతా సిబ్బంది తనకు చెప్పారని తెలిపారు. అయితే, తాను మాత్రం తమ పార్టీ వాళ్లతో మాట్లాడి.. యాత్రలో ముందుకెళ్లేందుకు నిశ్చయించుకున్నట్లు పేర్కొన్నారు. అలా నడుస్తున్నప్పుడు.. ఓ వ్యక్తి తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడాలని చెప్పాడని.. కాంగ్రెస్ నేతలు నిజంగానే జమ్మూకాశ్మీర్ కు వచ్చి ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అని అడిగాడని చెప్పారు.

ఉగ్రవాదులను చూశా.. కానీ, వారు దాడి చేయలేదంటూ రాహుల్
ఆ తర్వాత కొంతసేపటికి ఆ వ్యక్తి.. కాస్త దూరంగా ఉన్న కొంతమందిని చూపిస్తూ.. వాళ్లంతా ఉగ్రవాదులు అని చెప్పాడని రాహుల్ తెలిపారు. ఆ సమయంలో తాను నిజంగానే సమస్యల్లో ఉన్నానేమోనని అనిపిచిందని.. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఆ తీవ్రవాదులు తనను చంపేసేవారేనని అన్నారు. అయితే, వారు అలా చేయలేదన్నారు. లిజనింగ్ కు ఉన్న శక్తి అదంటూ రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలు వినడానికి వచ్చానన్న కారణంతోనే తనను వాళ్లు ఏమి చేయలేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తనపై నిఘా పెట్టారంటూ రాహుల్ గాంధీ
తన ఫోన్లోకి పెగాసస్ జొప్పించారన్నారు. చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లపైనా ఇలాగే నిఘా పెట్టారన్నారు. దీనిపై కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు తనకు కాల్ చేసి.. మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. మీ మాటలను రికార్డు చేస్తున్నాం అని హెచ్చరించినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా తాము ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని, క్రిమినల్ చట్టాల పరిధిలోకి రాని ఎన్నో అంశాల ఆధారంగా తనపై కేసులు పెడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని అన్నారు.












Click it and Unblock the Notifications