వా..వా.. తలైవా: దుమ్ము రేపుతున్న దర్బార్: కమ్మేసిన రజినీ మేనియా: జపాన్ నుంచి ఫ్యాన్స్.. !
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ లేటెస్ట్ మూవీ దర్బార్.. దుమ్మురేపుతోంది. రజినీకాంత్ మేనియా తమిళనాడును కమ్మేసింది. పొంగల్ పండుగను వారంరోజుల ముందుగానే తీసుకొచ్చింది. పండుగ కళను సంతరించుకుంది. దర్బార్ సినిమాను ప్రదర్శిస్తోన్న థియేటర్ల వద్ద అభిమానులు ఆనందానికి హద్దు లేకుండా పోయింది. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. ఆ ఆనందం కాస్తా రెట్టింపు అయింది. తమ ఆరాధ్య దైవం సినిమా హిట్ కావడంతో పండగ చేసుకుంటున్నారు.
అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద బారులు..
దర్బార్ సినిమా ప్రదర్శనకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులను మంజూరు చేసింది. సినిమా విడుదలైన తేదీ నుంచి అయిదు రోజుల పాటు ఆరు షోలను ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చింది. ఫలితంగా- అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకే సినిమాను ప్రదర్శించారు థియేటర్ల యాజమానులు. ఈ షో కోసం వందలాది మంది అభిమానులు అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద బారులు తీరి కనిపించారు.
బాణాసంచా పేల్చి.. థియేటర్లను సింగారించి..
దర్బార్ సినిమాను ప్రదర్శిస్తోన్న థియేటర్లన్నీ సింగారించుకున్నాయి. విద్యుద్దీపాలతో థియేటర్లను అలంకరించారు. రజినీకాంత్ బొమ్మలను ముద్రించిన జెండాలు కట్టారు. ఇక బ్యానర్లు, ఫ్లెక్సీలకు లెక్కే లేదు. అభిమానుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దర్బార్ సినిమా థియేటర్ల వద్ద పోలీసుల భద్రతను మోహరింపజేశారు. ఒకట్రెండు ప్రాంతాల్లో థియేటర్ల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. చెన్నైలో దాదాపు ప్రతి థియేటర్‌లోనూ ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.

జపాన్ నుంచి ఫ్యాన్స్..
రిజినీకాంత్‌కు జపాన్‌లో వేల సంఖ్యలో అభిమానులు ఉన్న విషయం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. రజినీ సినిమా విడుదలవుతోందంటే.. ఖచ్చితంగా చెన్నైలో దిగితీరుతారు. ఇదివరకు కాలా, పేట్టై వంటి సినిమాలకూ పెద్ద సంఖ్యలో ఓ బ్యాచ్ మొత్తం జపాన్ నుంచి చెన్నైలో దిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ సారి కూడా కొందరు అభిమానులు దర్బార్ మూవీని చూడటానికి జపాన్ నుంచి వచ్చారు. వారితో రజినీ అభిమానులు వారితో సెల్ఫీ తీసుకున్నారు.

మంగళవాయిద్యాలు.. పూజలు, పునస్కారాలు..
దర్బార్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. ఆరాధ్యదైవం, వెండితెర ఇలవేల్పు సినిమా హిట్ కావాలంటూ తాము చేసిన పూజలు, పునస్కారాలు ఫలించాయంటూ తమ ఆనందాన్ని చాటుకున్నారు. థియేటర్ల వద్ద మంగళ వాయిద్యాలను మోగిస్తూ, రజినీ స్టైల్లో స్టెప్పులు వేస్తూ అలరించారు. తమిళనాడు మొత్తంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రజినీకాంత్ నటించిన పేట్టై సినిమా సూపర్ హిట్ అయ్యిందని, దర్బార్ మూవీ దాన్ని మించిపోయిందని ఎగిరి గంతులేస్తున్నారు అభిమానులు.












Click it and Unblock the Notifications