నా కార్యకర్తలతో వేరే పార్టీ జెండా మోయనివ్వను- ఇదీ కదా అసలు హీరోయిజం అంటే..!!
TVK: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. తమిళనాడు. ఇప్పటివరకు అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే మధ్య ఎన్నికల్లో.. ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొనడం ఖాయమైంది. డీఎంకే- ఏఐఏడీఎంకేతో పాటు తమిళగ వెట్రి కజగం.. (TVK) పూర్తి స్థాయి ఎన్నికల సంగ్రామానికి దిగబోతోంది.
టీవీకే తరఫున ప్రముఖ నటుడు దళపతి విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని టీవీకే అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనితో పాటు పలు తీర్మానాలపై పార్టీ కార్యనిర్వాహక కమిటీ ఆమోదముద్ర వేసింది.

2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో గానీ, భారతీయ జనతా పార్టీతో గానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి పొత్తు పెట్టుకోవట్లేదని విజయ్ స్పష్టం చేశారు. తమిళనాడులో బీజేపీ ఎప్పటికీ ఎదగదని తేల్చి చెప్పారు. డీఎంకే లేదా అన్నాడీఎంకే లాగా రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని అన్నారు.
ఏ రాజకీయ పార్టీ అయినా టీవీకేతో జట్టు కట్టాలంటే.. వాటికి డీఎంకే, ఏఐఏడీఎంకే, బీజేపీతో ఎటువంటి సంబంధం ఉండకూడదని అలాంటి వాటినే తాము చేర్చుకుంటామని విజయ్ పేర్కొన్నారు. ప్రత్యేకించి- బీజేపీపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చవకబారు రాజకీయాల కోసం, రాజకీయ లబ్ది కోసం ప్రజలను మతాలవారీగా విభజిస్తోందని మండిపడ్డారు.
బీజేపీ నాయకుల కుట్రలు, కుతంత్రాలు ఇతర రాష్ట్రాల్లో పనిచేయవచ్చని, తమిళనాడులో కాదని విజయ్ హెచ్చరించారు. ఇలాంటి మత రాజకీయాలకు తమ రాష్ట్రంలో చోటు లేదని, వీటిని అడ్డుకుని తీరతామనీ అన్నారు. సామాజిక న్యాయం, మత సామరస్యం, శాంతి- సౌభ్రాతృత్వాలు బలంగా పాతుకుపోయిన నేల.. తమిళనాడుదని చెప్పారు.
పెరియార్, అన్నాదురై వంటి పలువురు మహనీయులను అవమానించి బీజేపీకి తమిళనాడులో ఎప్పటికీ చోటు దక్కదని, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా విజయం సాధించబోదని విజయ్ అన్నారు. సెప్టెంబర్ నుంచి విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ తెలిపిన వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్త పర్యటన కంటే ముందే అంటే ఆగస్టులో భారీ ఎత్తున రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించాలని కూడా టీవీకే ప్రతిపాదించింది. పార్టీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల గుండా విజయ్ పర్యటించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేయనుంది టీవీకే.












Click it and Unblock the Notifications