షాక్ కొట్టేలా పెరిగిన పాల రేట్లు
Amul Milk price: దేశంలో ఎన్నికల సందడికి తెర పడింది. జూన్ 1వ తేదీ నాటితో చివరి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఏప్రిల్ 19వ తేదీన తొలి విడత ఎన్నికల మొదలు కాగా.. ఏడు దశల్లో ఓటింగ్ కొనసాగింది. 90 కోట్ల మందికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోనున్నారు. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఎన్నికలు ముగిసీ ముగియగానే కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ప్లాజా రేట్లను అమాంతం పెంచేసింది. పెంచిన ఛార్జీలు అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.

ఇప్పుడు తాజాగా పాల వంతు వచ్చింది. పాల రేట్లు పెరిగాయి. దేశంలోనే అతిపెద్ద పాల సేకరణ సమాఖ్య అమూల్.. తన ధరలను సవరించింది. పాల రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన రేట్లు ఈ తెల్లవారు జాము నుంచి అమలులోకి వచ్చాయి.
అన్ని రకాల వేరియంట్లకూ పెరిగిన ధరలను వర్తింపజేసింది అమూల్. గోల్డ్, తాజా, శక్తి, టీ-స్పెషల్ వంటి వేరియంట్లు ప్రస్తుతం అమూల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆవు, గేదె పాలను విక్రయిస్తోందా సమాఖ్య. పెంచిన రేట్ల ప్రకారం చూసుకుంటే- అమూల్ గోల్డ్ లీటర్ పాల ధర 66 నుంచి 68 రూపాయలకు పెరిగింది. తాజా బ్రాండ్ లీటర్ పాకెట్ 54 నుంచి 56 రూపాయలకు చేరింది. ఆవు పాలపై లీటర్ ఒక్కింటికి ఒక రూపాయి మేర పెరిగింది. లీటర్ పౌచ్ 57 రూపాయలు పలుకుతోంది.
ఆవు పాలతో పోల్చుకుంటే గేదె పాల రేట్ల మాత్రం భారీగా పెరిగాయి. లీటర్ ఒక్కింటికి మూడు రూపాయల మేర పెరుగుదల కనిపించిందిందులో. 70 రూపాయలు ఉన్న అమూల్ లీటర్ గేదె పాల ధర 73 రూపాయలకు చేరుకుంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో చివరిసారిగా అమూల్ సమాఖ్య తన పాల రేట్లను సవరించింది. ఇప్పుడు మళ్లీ కొనుగోలుదారులపై ఆ భారం మోపింది.
పాల సేకరణ రేట్లను పెంచాల్సి రావడం వల్ల సంస్థపై అదనంగా పడిన భారం పడిందని, వినియోగదారులపై నామమాత్రంగా దాన్ని మోపినట్లు అమూల్ బ్రాండ్ ప్రమోటర్ గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా తెలిపారు. తమ పాలసీ ప్రకారం- బహిరంగ మార్కెట్‌లో పాలు, పాల సంబంధిత పదార్థాలను విక్రయించడం వల్ల వచ్చే ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలను పాడి రైతులకు చెల్లిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications