Madhya pradesh election 2023: ఓటు వేస్తే పోహా, జిలేబీ ఉచితం..
సాధారణంగా ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు హామీలు, ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ మధ్యప్రదేశ్ లో దుకాణదారుల సంఘం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఓటు వేసిన వారికి ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని ఇండోర్ లోని ఒక దుకాణదారుల సంఘం ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ముందుగా ఓటు వేసిన వారికి మాత్రమేనని స్పష్టం చేసింది. ఇండోర్‌లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకు నవంబర్ 17న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇండోర్‌లోని ఫుడ్ హబ్ '56 డుకాన్' ఆవరణలో ఉన్న షాపుల యజమానులు ఈ వినూత్న ఆఫర్‌ను ప్రకటించారు. ముందుగా ఓటు వేసి వేలికి సిరా చూపించిన వారికి ఉచితంగా పోహా, జిలేబీ అందజేస్తామని వివరించారు. ఈ ఆఫర్ పోలింగ్ రోజు ఉదయం 9 గంటల వరకు వర్తిస్తుందని యజమానుల సంఘం స్పష్టం చేసింది.

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే ఈ ఆఫర్ ప్రకటించినట్లు 56 డుకాన్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుంజన్ శర్మ తెలిపారు. పరిశుభ్రతలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఇండోర్ ను ఓటింగ్ శాతంలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.ఓటింగ్ రోజు నిర్దేశిత సమయం తర్వాత ఓటు వేసే వారికి 10 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. ఇండోర్ అర్బన్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2018లో 14.72 లక్షల మంది ఓటర్లలో 67 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి 15.55 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
నవంబర్ లో మధ్యప్రదేశ్ తో పాటు రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరాం, తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. మధ్యప్రదేశ్ లో ఆఫర్ పెట్టినట్లుగానే తెలంగాణలో కూడా అలాంటి ఆఫర్ పెడితే బాగుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications