Haryana Elections: బీజేపీ ఆశలన్నీ అక్కడే - కాంగ్రెస్ ఛాన్స్ ఇస్తుందా..!!
హర్యానా ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. అధికార బీజేపీ పైన అసంతృప్తిని అధిగమించి మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. మూడో సారి వరుసగా ఎవరికీ హర్యానా ప్రజలు పట్టం కట్టలేదు. కాంగ్రెస్ ఈ సారి అధికారం ఖాయమనే ధీమాతో ఉన్నా..సామాజిక సమీకరణాల లెక్కలు కీలకంగా మారుతున్నాయి.
హర్యానాలో అధికారం నిలబెట్టుకోవటం కోసం బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. జాట్‌యేతర, దళిత ఓటర్లను సంఘటితం చేసేందుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత కుమ్ములాటలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. కుల సమీకరణాలు, పార్టీల తగాదాలు ప్రధానాంశంగా మారాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

హర్యానా రాష్ట్రం1966లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా మూడోసారి విజయం సాధించలేదు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందుకు మూడు అంశాలను పునాదులుగా మార్చుకుని పోరాటం చేస్తోంది. ప్రస్తుతం బహుముఖ పోటీ జరగనున్న నేపథ్యంలో ఓట్ల చీలిక తమకు లాభిస్తుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో 5 స్థానాలను గెలుచుకున్నాయి. హరియాణా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ.. ఆర్ఎస్ఎస్ సహకారం తీసుకుంటోంది.
వ్యూహాత్మకంగా గ్రామీణ నియోజకవర్గాలపై దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 45 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది. దీంతో బీజేపీ ప్రస్తుతం అప్రమత్తమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పొరపాటు జరగకూడదని ఆర్ఎస్ఎస్ ప్రచారక్ లను రంగంలోకి దింపింది. ప్రతి జిల్లాకు 150 మంది వాలంటీర్లను కేటాయించి గ్రామీణ ఓటరు ఔట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దళితుల మధ్య విభజనను పసిగట్టి జాట్‌యేతర ఓటర్లను సంఘటితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications