Rahul Gandhi: సూరత్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాల్సిందే.. గుజరాత్ హైకోర్టులో సింఘ్వీ వాదన..
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు శనివారం విచారించింది. రాహుల్ గాంధీ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఆరు ప్రాథమిక కారణాలను బట్టి సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించవచ్చని చెప్పారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు అంత తీవ్రమైనవేమీ కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సింఘ్వీ.. రాజకీయ ఉద్దేశంతోనే ఆయన్ను ఇరికించారని తెలిపారు. రెండేళ్ల జైలు శిక్ష విధించడం వల్ల రాహుల్ గాంధీ ఎంపీ పదవి కోల్పోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
స్టే కోసం గాంధీ చేసిన విజ్ఞప్తిని సూరత్ సెషన్స్ కోర్టు తిరస్కరించిందని సింఘ్వీ అన్నారు. ఇటువంటి క్రిమినల్ పరువు నష్టం కేసులో శిక్షపై స్టే విధించాలన్న గాంధీ అభ్యర్థనను తిరస్కరించడం ద్వారా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 389 పరిధిని కోర్టు "తిరిగి రాస్తుంది" అని సింఘ్వీ అన్నారు. కేవలం 10 నిమిషాల పాటు శిక్షా అంశంపై విచారణ జరిపిన తర్వాత సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి గరిష్ట శిక్ష విధించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే సమస్య మరింత జఠిలమవుతుందని కోర్టుకు తెలిపింది. ఒక వేళ ఆ ఎన్నికల్లో వేరే అభ్యర్థి విజయం సాధించి.. తన శిక్షను రద్దు చేయాలన్న రాహుల్‌గాంధీ పిటిషన్ నెగ్గితే.. ఆయనకు తిరిగి ఎంపీ బాధ్యతలు అప్పగించడానికి అవకాశం ఉండదని తెలిపింది. వాదానలు విన్న గుజరాత్ హైకోర్టు మే 2కు తుది విచారణను వాయిదా వేసింది.

రాహుల్ గాంధీ 2019 కర్టాటకలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంటి పేరు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మార్చి 23న రాహుల్ గాంధీ దోషిగా తేలుస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పిల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం కూడా ఇచ్చింది. రాహుల్ గాంధీ తన శిక్షను నిలుపుదల చేయాలంటూ రాహుల్ గాంధీ చేసిన విజ్ఞప్తిని సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications