మాజీ మంత్రి, ఎమ్మెల్యేని అరెస్టు చెయ్యకండి, ప్రభుత్వానికి, సీఐడీకి హైకోర్టు ఆర్డర్, రూ 439 కోట్లు !
బ్యాంకులకు రుణాలు చెల్లించని వ్యవహారంలో సీఐడీ అరెస్ట్ చేస్తుందని భయపడుతున్న కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళికి హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. దాంతో ఇప్పుడు సీఐడీ అరెస్ట్ భయం నుంచి రమేష్ జారకిహోళికి తాత్కాలికంగా రిలీఫ్ చిక్కింది. కుమారుడి వివాహం నేపథ్యంలో, తదుపరి విచారణ వరకు బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సీఐడీని ఆదేశించింది.
షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి అపెక్స్ బ్యాంకులో రూ. 439 కోట్లు రుణం తీసుకున్న తిరిగి చెల్లించలేదని, ఆ సౌభాగ్యలక్ష్మి షుగర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రమేశ్ జారకిహోళిపై నమోదైన కేసును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. పిటిషనర్ రమేష్ జారకిహోళి కుమారుడి వివాహం ఫిబ్రవరి 26వ తేదీన జరగనుందని, ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రమేష్ జారకిహెళికి రక్షణ కల్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ అంశాన్ని న్యాయస్థానం ముందు చెప్పారు.
న్యాయస్థానం రమేష్ జారకిహోళి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంది. హిందూ మత సంప్రదాయాల ప్రకారం కుమారుడి వివాహానికి తండ్రి హాజరుకావడం తప్పనిసరి అని పేర్కొంది. అందువల్ల తదుపరి విచారణ వరకు మొదటి పిటిషనర్ (రమేష్ జారకిహోళి)పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని దర్యాప్తు అధికారులను ఆదేశించింది. అపెక్స్ బ్యాంక్ నుండి దరఖాస్తుదారుడు పొందిన రుణం, దాని చెల్లింపుకు సంబంధించి పూర్తి వివరణను తదుపరి విచారణలో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications