జేఏసీ ఏర్పాటు- బంతి రేవంత్ కోర్టులో..!!
Delimitation: దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోన్న అంశం- డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తోన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశం సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. డీలిమిటేషన్ అంశంపై ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యాచరణను నిర్వహించడానికి ప్రత్యేకంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలను భాగస్వామ్యం చేశారు.
నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా డీలిమిటేషన్ జరగాల్సిన అవసరం ఉందని స్టాలిన్ డిమాండ్ చేశారు. పక్షపాత వైఖరిని కేంద్రం ప్రదర్శించితే దాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన న్యాయ సలహాలను ఇవ్వాలని ఆయన దక్షిణాది రాష్ట్రాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల విభజన అనేది న్యాయబద్ధంగా చేపట్టడానికి నిపుణుల కమిటీని సైతం ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
ఈ అంశంపై ఎట్టిపరిస్థితుల్లోనూ వెన్నుచూపని పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని, దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఐక్యంగా ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. తమకు ఎంతమాత్రం ప్రాధాన్యత తగ్గకుండా చూసుకోవాలని, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను విభజించడం సరికాదని అన్నారు.
దీనివల్ల తమిళనాడు వంటి రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, అసమానతలు తలెత్తుతున్నాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాను ఆధారంగా చేసుకోవడం వల్ల లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గుతుందని వివరించారు. ఫలితంగా ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications