ఉగ్రవాద టెక్కి ఖాతాలో లో రూ. 20 లక్షలు
బెంగళూరు/ముంబై: దేశవ్యాప్తంగా శుక్రవారం ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులకు ముంబై నుంచి సూచనలు, సలహాలు వస్తున్నాయని గుర్తించారు.
ముంబైలో నివాసం ఉంటున్న ఉగ్రవాది ఆదేశాల మేరకు మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులు పని చేస్తున్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. శుక్రవారం దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
కర్ణాటకలోనే నలుగురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. ముంబైలో నివాసం ఉంటున్న ముదబ్బిర్ ముస్తాఖ్ యూసఫ్ అలియాస్ ముస్తాఖ్ (34) అనే ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఇతను సాఫ్ట్ వేర్ ఇంజనీరు(టెక్కి) అని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.
అరెస్టు అయిన అందరూ ముంబైలోని ముస్తాఖ్ ఇచ్చే సూచనలు, సలహాల మేరకు పని చేస్తున్నారని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. దేశంలోని పలు ప్రాంతాంలో అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
అరెస్టు అయిన అందరితో ముస్తాఖ్ కు సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. ముంబైలో అరెస్టు అయిన ముస్తాఖ్ కర్ణాటకలోని భట్కళ్ కు చెందిన సుల్తాన్ అర్మర్ బంధువు అని అధికారులు తెలిపారు.

సుల్తాన్ భారత్ లోని యవకులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేర్పించడానికి అన్సర్-ఉల్-తవాహిద్ అనే సంస్థను స్థాపించాడు. తరువాత యువతను సంప్రదించి ఉగ్రవాద సంస్థలో చేరాలని రెచ్చగొట్టాడు.
ఇదే సమయంలో సుల్తాన్ హత్యకు గురైనాడు. తరువాత సుల్తాన్ సోదరుడు షఫి అర్మర్ అన్సర్-ఉల్-తవాహిద్ అనే సంస్థను ముందుకు నడిపిస్తున్నాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది.
రూ. 20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి............!
ముంబైలో శుక్రవారం అరెస్టు అయిన ముస్తాఖ్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసేవాడు. అయితే రెండు సంవత్సరాల క్రితమే అతను ఉద్యోగం నిలిపివేశాడు. అతని బ్యాంకు అకౌంట్ లో ప్రస్తుతం రూ. 20 లక్షలకు పైగా నగదు ఉందని అధికారులు ఆధారాలు సేకరించారు.
జనవరి 26 వ తేది జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా దేశంలోని పలు నగరాల్లో అరాచకాలు సృష్టించాలని ముంబైలోని ముస్తాఖ్ ఇతర ప్రాంతల్లో నివాసం ఉంటున్న వారికి సూచనలు, సలహాలు ఇచ్చాడని అధికారులు తెలిపారు. కర్ణాటకలో అరెస్టు అయిన నిందితులను శనివారం కోర్టులో హాజరుపరుస్తున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications