ఓటు వెయ్యాలంటే మాకు నోటు వద్దు, మాకు కావలసింది మీ దగ్గర ఉంది, మంత్రికి డెడ్ లైన్ !
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హిరియూరు తాలూకా వాణి విలాస రిజర్వాయర్ నుంచి భరమగిరి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందించకపోతే లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డి. సుధాకర్‌కు గ్రామస్తులు హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటక ప్రభుత్వానికి, మంత్రికి కొన్ని గ్రామాల ప్రజలు డెడ్ లైన్ పెట్టడం కర్ణాటకలో కలకలం రేపింది
తాగునీరు అందడం లేదని గ్రామస్తులు నిరసన వ్యక్తం చెయ్యడంతో కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం బిత్తరపోయింది. వాణి విలాస రిజర్వాయర్‌కు సుమారు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామాలకు తాగునీరు అందించాలని ప్రజలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పోరాటం చేస్తామని పరిసర ప్రాంతాల్లోని గ్రామాస్తులు కర్ణాటక మంత్రి సుధాకర్ ను హెచ్చరించారు.

గ్రామం సమీపంలోనే ఒక సరస్సు (చెరువు) ఉండేది, ఇప్పుడు ఆ సరస్సు నీరు లేకుండా ఎండిపోయింది. చుట్టుపక్కల రైతుల భూముల్లో భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపోయాయి. వేల అడుగుల మేర బోరు బావులు వేసినా నీరు రావడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. రైతులు తమ తోటలను, చేతికి వస్తున్న పంటను కూడా కాపాడుకోలేకపోతున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
పంటలు నాశనం కావడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో వాణి విలాసపురం గ్రామపంచాయతీ పరిధిలోని భరమగిరి, బాలఘట్ట, తలవరట్టి, అగలేరహట్టి, కక్కయనహట్టి, కుంటప్పనహట్టి ఈ గ్రామాల్లో ప్రజలకు, పశువులకు తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదని ఆ గ్రామాల ప్రజలు ఆరోపించారు.
మా ఊరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాణి విలాస రిజర్వాయర్ నుంచి భరమగిరి చెరువుకు నీటిని తరలించాలని ప్రజలు డిమాండ్ చేశారు. వందల కిలోమీటర్ల మేర నీటిని సరఫరా చేయవచ్చు. కానీ ఆనకట్ట దిగువన ఉన్న గ్రామాలకు ఎందుకు నీరు అందించలేకపోతున్నారని గ్రామస్తులు మంత్రి సుధాకర్ తో పాటు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తుల వినతులపై మంత్రి డి. సుధాకర్ స్పందిచపోతే లోక్ సభ ఎన్నికలను సామూహికంగా బహిష్కరిస్తామని పరిసర ప్రాంతాల ప్రజలు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications