మైనింగ్ అడ్డా బళ్లారిలో ఓటింగ్ బహిష్కరించిన ప్రజలు, మా భూములపై మీ పెత్తనం ఏమిటి !
కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇప్పటికే 14 లోక్ సభ నియోజక వర్గాల్లో పోలింగ్ పూర్తి అయ్యింది. మిగిలిన 14 లోక్‌సభ నియోజకవర్గాలకు మంగళవారం పోలింగ్ జరుగుతోంది. కర్ణాటకలో హాట్ లోక్ సభ నియోజక వర్గాల్లో ఒక్కటి అయిన బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కూడా ఉదయం ఓటింగ్ ప్రారంభమైంది. అయితే బళ్లారి లోక్ సభ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఓటింగ్‌ను సామూహికంగా బహిష్కరించారు.
పోలింగ్ బహిష్కరించిన గ్రామంలోని ప్రజలను ఒప్పించడంలో బళ్లారి జిల్లా అధికారులు, ఎన్నికల అధికారులు చివరికి విజయం సాధించారు. బళ్లారి తాలూకాలోని కృష్ణానగర్ క్యాంపులో నివాసం ఉంటున్న ప్రజలు మంగళవారం ఓటు వేయబోమని ఆ ప్రాంతంలోని ప్రజలు అందరూ ఓటింగ్‌ను బహిష్కరించారు. అందుకోసం వివిధ శాఖల అధికారుల మధ్యవర్తిత్వం వహించి గ్రామంలోని ప్రజలను ఒప్పించడంతో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడానికి ముందుకు వచ్చారు.

కృష్ణానగర్ క్యాంపును 2ఏ కింద రెవెన్యూ గ్రామంగా చేయరాదని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు మంగళవారం ఎన్నికల పోలింగ్ ను బహిష్కరించారు. మే 7వ తేదీన మంగళవారం జరిగే పోలింగ్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు ఆ క్యాంపులోని శిబిరం ప్రజలు నిరసన తెలిపారు. ఇప్పటికే క్యాంపులో సర్వే చేసి రెవెన్యూ గ్రామంగా మార్చేందుకు సన్నాహాలు చేశారని స్థానిక ప్రజలు ఆరోపించారు. గ్రామంలోని పలు పట్టా భూములు ప్రభుత్వ భూములుగా మారాయని ప్రజలు ఆరోపించారు.

పట్టాదారులు రైతు వర్గానికి చెందిన వారు. వ్యవసాయ భూమిలో ఇళ్లు కూడా నిర్మించుకున్నామని, ఈ గ్రామంలో చాలా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయని, మా సొంత డబ్బుతో కొనుగోలు చేసిన భూమిని రెవెన్యూ భూముల అంటూ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని, దీనిపై గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులెవరూ స్పందించలేదని, కాబట్టి ఓటింగ్‌ను తాము బహిష్కరిస్తామని స్థానిక ప్రజలు తేల్చి చెప్పారు. అయితే ఎన్నికల అధికారులు గ్రామం చేరుకుని ప్రజలకు నచ్చచెప్పి వాళ్లు ఓటింగ్ లో పాల్గొనేలా చెయ్యడంలో విజయం సాధించారు.
బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో 18,84,040 మంది ఓటర్లు ఉండగా 1,972 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. బళ్లారి జిల్లాలో పోలింగ్ కోసం 5,952 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ప్రతి ఓటు అమూల్యమైనదని, పొరపాటు లేకుండా ఓటు వేయండి అని జిల్లా ఎన్నికల అధికారి, బళ్లారి కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. బళ్లారి రిజర్వ్ డ్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి తుకారాం, బీజేపీ నుంచి మాజీ మంత్రి బి. శ్రీరాములుతో సహ పలు పార్టీల నాయకులు పోటీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications