సర్పంచ్ పదవిని వేలంలో ఏకంగా రూ.2 కోట్లకు కొనేశారు.. ఎక్కడంటే?!
గ్రామస్థాయిలో సర్పంచ్ అంటే ఓ గౌరవం. పెద్దమనిషిగా వ్యవహరిస్తూ స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించే ఓ ఉన్నత పదవి. అలాంటి గౌరవాన్ని.. పదవిని ఆ గ్రామంలో వేలం వేశారు. ఆ వేలంపాటలో ఓ పెద్దమనిషి ఏకంగా రెండుకోట్ల రూపాయలకు సర్పంచ్ పదవిని కొనుక్కున్నాడు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ వ్యవస్థ డబ్బుకు దాసోహం అనేందుకు
ఈ ఘటన ఓ మచ్చుతునక లాంటిది. ఈ చర్య వెలుగు చూడడంతో పలువురు రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్‌లోని హర్దోవల్ కలాన్ గ్రామంలో జరిగిన సర్పంచ్ వేలంపాట ఘటన దేశం మొత్తం నివ్వెరపోయేలా చేసింది. హర్దోవల్ కలాన్ గ్రామంలో అక్టోబర్ 15న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయి ఉన్నారు. అయితే, అప్పటికే సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు స్థానిక నాయకులు అధికారులకు తెలిపారు. గ్రామస్థాయిలో ఏకగ్రీవం అవ్వటం సర్వసాధారణం. అయితే, ఇక్కడ మాత్రం ఆ ఎన్నిక డబ్బుతో ముడిపడిందని తెలియడంతో అధికారులు సైతం అవాక్కయ్యారు.

రూ.50లక్షలకు వేలం మొదలు...
గ్రామ సర్పంచ్ పదవికి పెద్దలు వేలంపాట నిర్వహించారు. ఈ వేలం రూ. 50 లక్షలకు ప్రారంభం కాగా, ఆత్మాసింగ్ అనే స్థానిక బీజేపీ నాయకుడు ఏకంగా రూ. 2 కోట్లకు సర్పంచ్ పదవిని కొనుక్కున్నాడు. ఈ వేలం ప్రక్రియ పూర్తయిన తర్వాత చెక్కు ద్వారా చెల్లింపు చేసినట్లు ఆత్మా సింగ్ తెలిపారు. గతంలో ఆత్మాసింగ్ తండ్రి కూడా ఈ గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. అతిపెద్ద గ్రామాలలో ఒకటి. హర్దోవల్ కలాన్ గురుదాస్‌పూర్ జిల్లాలోని దాదాపు 350 ఎకరాల పంచాయతీ భూమిని కలిగిన పెద్ద గ్రామం.
ఇది బహిరంగ అవినీతి..
అయితే, ఈ విషయం బయటికి రావడంతో పలువురు సీనియర్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇలాంటివారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికి బహిరంగ అవినీతి కిందకి వస్తుందని అన్నారు. అంత సొమ్ము ఆఫర్ చేసిన వారిపై విజిలెన్స్ బ్యూరో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. దేశంలో ఏ ఎన్నికైనా ఏకగ్రీవం అవ్వటంలో తప్పు లేదు. కానీ, ఇలా ఆ ఎన్నిక డబ్బుతో ముడిపడడం ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు అని పలువురు మేధావులు స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications