దేశంలోని అతి చిన్న పోలింగ్ బూత్.. ఛత్తీస్‌ఘడ్‌లో..
భారతదేశంలో అతి చిన్నపోలింగ్ బూత్ ఉంది. అది ఎక్కడో తెలుసా...? మరెక్కడో కాదండి ఛత్తీస్‌ఘడ్‌లోనే. ఇందులో కేవలం ఐదుగురి ఓట్ల కోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ బూత్ ఉంటుంది. ఇదే దేశంలోని అతి చిన్న పోలింగ్ బూత్ పేరుగాంచింది. ఛత్తీస్‌గఢ్‌లోని భరత్‌పూర్ సన్హాట్‌లో షెరదాండ్ అనే గ్రామం ఉంది. ఇక్కడ కేవలం మూడే ఇళ్లు ఉంటాయి. ఈ మూడు ఇళ్లకు కలిపి ఐదుగురు ఓటర్లు ఉన్నారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 143వ పోలింగ్ స్టేషన్ ఇది. ఈ స్టేషన్ కేవలం ఈ ఐదుగురి కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. నవంబర్ 7న ఇక్కడ పోలింగ్ జరుగనుంది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం పదండి.
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది ఛత్తీస్‌గఢ్. భూపేష్ బఘెల్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తిరిగి అధికారం కోసం ఎంతగానో కృషి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసి ఇక్కడ అధికారంలోకి రావాలని బీజేపీ ఎంతో పట్టుదలగా ఉంది. అందుకోసం విశ్వప్రయత్నాలు చేస్తుంది.

2008లో కేవలం ఇద్దరు ఓటర్లు మాత్రమే : భరత్‌పూర్ సన్హాట్‌లో షెరదాండ్ గ్రామంలో 2008లో కేవలం ఇద్దరు ఓటర్ల కోసం మాత్రమే ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఒక పూరిగుడిసెలో. అప్పడే ఈ గ్రామం గురించి ప్రపంచానికి తెలిసింది. కొరియా జిల్లా సోన్హట్ బ్లాక్ చంద్ర గ్రామ్ పంచాయతీకి చెందిన డిపెండెంట్ విలేజ్ ఇది. దట్టమైన అడవుల్లోని ఈ షెరదాండ్‌లో కేవలం మూడు ఇళ్లు మాత్రమే ఉన్నాయి.
అందులో ఒక ఇంట్లో అరవై ఏళ్ల వయసున్న ఓ వృద్ధుడు ఉన్నాడు. అతని పేరు మహిపాల్ రామ్, అతను ఒక్కడే ఈ గుడిసెలో ఉంటాడు. ఇక రెండో ఇంట్లో రామ్‌ప్రసాద్ చెర్వా అనే వ్యక్తి తన భార్య సింగారో, నలుగురు పిల్లలతో కలిసి ఈ గ్రామంలో నివసిస్తున్నాడు. మూడో ఇంట్లో దస్రు రాము అనే వ్యక్తి తన భార్య సుమిత్ర, ఒక కుమార్తె, మరో కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు.
143 వ పోలింగ్ స్టేషన్ : ఈ మూడిళ్లకు కలిపి ఐదుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ముగ్గురు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు. ఈ ఐదుగురు ఓటర్లలో దస్రు రాము ఐదేళ్ల క్రితం జష్‌పూర్ నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 143వ పోలింగ్ స్టేషన్ ఇదే. ఇది కూడా కేవలం ఈ ఐదుగురి కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. 2008 నుంచి ఒక గుడిసెలో ఓటింగ్ జరిగేది. ప్రస్తుతం ఇక్కడ పక్కా భవనం నిర్మించారు.
ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ బృందం రెండు రోజుల ముందే ఇక్కడికి వస్తుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకూ రెండు రోజులపాటు ఇక్కడే ఉంటుంది. పోలింగ్ జరిగిన ప్రతిసారి ఇక్కడ వంద శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. అంతేకాకుండా ఇక్కడ ఇదే అసెంబ్లీకి చెందిన కాంటోలు 12 మంది ఓటర్లు ఉన్నారు. రేవలలో కూడా 23 మంది ఓటర్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications