సుమోటోగా రంగంలో దిగిన సుప్రీం: సీజేఐ డీవై చంద్రచూడ్ సంచలనం
RG Kar gang rape: కోల్‌కతలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దుమారం రేపుతోంది. రోజురోజుకూ దీని తీవ్రత పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి.
ఈ నెల 9వ తేదీన ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే. శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం, చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది. హత్య చేయడానికి ముందు ఆమె గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఈ విషయాన్ని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సైతం ధృవీకరించారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. సీబీఐకి అప్పగించింది. రంగంలో దిగిన సీబీఐ అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు. దోషులకు మరణశిక్ష విధించాలంటూ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా రోడ్డెక్కారు.
ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా మెడికోలు, జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శనలను నిర్వహించారు. మమత బెనర్జీ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. దోషులు ఎంతటి వాళ్లయినా వదలకూడదంటూ పట్టుబట్టారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం స్పందించింది. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఔట్ పేషెంట్ విభాగాలు మూతపడ్డాయి. అత్యవసరం మినహా మిగిలిన అన్ని రకాల వైద్య సేవలను డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది బహిష్కరించారు.
ఈ దారుణ హత్యాకాండపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. రంగంలోకి దిగింది. ఈ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంగా దీనిపై విచారణకు చేపట్టారు. ఈ నెల 20వ తేదీన విచారణను లిస్టింగ్ చేశారు.
ఉదయం 10:30 గంటలకు టాప్ ప్రయారిటీ కింద ఈ అంశం విచారణకు రానుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ముగ్గురు సభ్యులు ధర్మాసనం విచారించనుంది. సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు వెలువడొచ్చనేది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications