టాప్‌లో ఆ నాలుగు- ఏపీ ర్యాంక్ ఎంత?
CareEdge Ratings: దేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో అవి ఎంత మేర పురోమించాయి? వాటి సొంత ఆదాయ వనరుల పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై తాజాగా కేర్ఎడ్జ్ రేటింగ్స్ అనే సంస్థ ర్యాంకులను ప్రకటించింది.
సొంత ఆదాయం..
దేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే బలమైన ఆదాయ వనరులను కలిగి ఉన్నాయని, వాటి సొంత ఆదాయం (State Own Revenues-SOR) మొత్తం రాబడిలో 60 నుంచి 80 శాతం వరకు ఉంటోందని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఆయా రాష్ట్రాలు తక్కువ రెవెన్యూ లోటును కలిగి ఉన్నాయని వివరించింది. అంటే- అభివృద్ధి కార్యక్రమాలపై అధిక మొత్తంలో ఖర్చు పెట్టగల సామర్థ్యం వాటికి ఉన్నట్టే.

జీడీపీలో..
ఆయా రాష్ట్రాలు చేసిన అప్పుల స్థాయి కూడా రెవెన్యూ లోటు తక్కువగా ఉందని కేర్ఎడ్జ్ వివరించింది. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో వాటి అప్పుల నిష్పత్తి 16 నుంచి 27 శాతం మధ్య ఉందని తన నివేదికలో పొందుపరిచింది. వడ్డీ చెల్లింపులు/మొత్తం రాబడి సగటున దాదాపు 9 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
అగ్రస్థానంలో..
రెవెన్యూ లోటు తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా అగ్రస్థానంలో నిలిచాయి. ఈ మూడింటి సొంత ఆదాయం 60 నుంచి 80 శాతం వరకు ఉంది. రెవెన్యూతో పోల్చుకుంటే అప్పుల స్థాయి 24 శాతంగా నమోదైంది.
రెవెన్యూతో పోల్చుకుంటే..
సొంత ఆదాయం 73 నుంచి 84 శాతం వరకు ఉన్నప్పటికీ- రెవెన్యూతో పోల్చుకుంటే అప్పుల స్థాయి 39 శాతంగా ఉన్న రాష్ట్రాల కేటగిరీలో హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. సొంత ఆదాయం 47 నుంచి 62 శాతం వరకు ఉన్నప్పటికీ- రెవెన్యూతో పోల్చుకుంటే అప్పుల స్థాయి 37 శాతంగా ఉన్న రాష్ట్రాల కేటగిరీలో ఏపీ, బిహార్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌ను చేర్చింది.
మూలధన వ్యయం..
పన్నుల రాబడి పెరుగుతున్నప్పటికీ, రాష్ట్రాలు తమ మూలధన వ్యయ లక్ష్యాలను అందుకోవడానికి 2024-2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి అంటే ఈ ఏడాది జనవరి- ఏప్రిల్ మధ్య కాలంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఖర్చును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా కేర్ ఎడ్జ్ నివేదిక అభిప్రాయపడింది.
మూలధన వ్యయ బడ్జెట్‌లో..
ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే- పెద్ద రాష్ట్రాలు మొత్తం 7.5 లక్షల కోట్ల రూపాయల మూలధన వ్యయ బడ్జెట్‌లో ఇప్పటివరకు 48 శాతం మాత్రమే ఉపయోగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు టాప్ 15 రాష్ట్రాల మూలధన వ్యయం 3.57 లక్షల కోట్ల రూపాయలు. ఇది- అంతకుముందు నాటి ఆర్థిక సంవత్సరం కంటే నాలుగు శాతం తక్కువ.
రాష్ట్రాలకు పన్నుల వాటా..
ఏప్రిల్ 2024 నుండి జనవరి 2025 వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటాగా 10.74 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసిందని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఇది గత ఏడాది కంటే 31 శాతం ఎక్కువ. రాష్ట్రాలు అభివృద్ధి ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చు చేయడానికి వీలుగా ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేసినట్లు పేర్కొంది.
12 శాతం వరకు..
మొత్తం పన్నుల వాటా విడుదల.. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు 12 శాతం వరకు పెరుగుతుందని కేర్ ఎడ్జ్ అంచనా వేసింది. రాష్ట్ర ఆదాయ వనరుల వృద్ధి మందగించడం వల్ల కేంద్ర బడ్జెట్‌లో అంచనా వేసిన 19 శాతం పెరుగుదల కంటే ఇది తక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications