అమెరికా నుంచి ఇండియాలో మూడో విమానం ల్యాండ్.. ఈసారి ఎంత మందంటే?
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను తిప్పి పంపే ప్రక్రియను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత వేగంగా చేపడుతోంది. ఇప్పటికే భారత్ నుంచి వెళ్లిన కొంతమంది అక్రమ వలసదారులను తిరిగి పంపించిన విషయం తెలిసిందే. తాజాగా, అమెరికా నుంచి మరో వలసదారుల విమానం ఆదివారం రాత్రి అమృత్‌సర్‌కు చేరుకుంది.
ఆ విమానంలో 112 మంది భారతీయులను వెనక్కి పంపించింది. ఇప్పటికే రెండు విమానాల్లో భారత్‌కు చెందిన వలసదారులను అమెరికా వెనక్కి పంపింది. ఫిబ్రవరి 5 నుంచి 10 రోజుల వ్యవధిలో 3 విడతలుగా వలసదారులను వెనక్కి పంపింది. తొలి విడతగా 104, రెండో విడతలో 116 మందిని భారత్‌కు పంపింది. తాజాగా 112 మంది భారత్ చేరుకున్నారు.

ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అమెరికా నుంచి వచ్చిన విమానం అమృత్ సర్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో 112 మంది అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. వీరిలో 44 మంది హర్యానాకు చెందిన వారు కాగా, 33 మంది గుజరాత్, 31 మంది పంజాబ్ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
అమెరికా నుంచి విమానం రావడంతో తమ వారిని చూసుకునేందుకు వారి వారి కుటుంబసభ్యులు అమృత్‌సర్ విమానాశ్రయం చేరుకున్నారు. తమవారిని చూసుకుని భావోద్వేగానికి గురయ్యారు. చాలా మంది ఏజెంట్ల ద్వారా మోసపోయిన వారుండగా, కొందరు అమెరికాలో అక్రమంగా ప్రవేశించాలని యత్నించినవారున్నారు.
అక్రమ వలసదారుల్లో కొందరికి నేర చరిత్ర ఉండటం గమనార్హం. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన విమానం నుంచి ఇద్దరు నేరస్తులను ఇక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు తమ ఆస్తులు అమ్మి అమెరికాకు వెళ్లామని.. అక్రమ వలసల పేరుతో అమెరికా నుంచి తమను తిరిగి పంపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications