మోడీ-అమిత్ షా సొంత రాష్ట్రం నుంచీ నరుక్కొస్తోన్న కేసీఆర్: గుజరాత్‌లో భారీగా బ్యానర్లు
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు- తన థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే- పూర్తి స్థాయిలో ఈ కూటమిని క్రియాశీలకంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేపట్టారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో వామపక్ష నేతలు, బిహార్ ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ కీలక నేతలతో సమావేశం అయ్యారు.

ఉద్ధవ్‌తో భేటీపై
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని హైదరాబాద్‌కు ఆహ్వానించారు. డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సంప్రదింపులు నిర్వహిస్తోన్నారు. ఆదివారం ఆయన ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలుసుకోనున్నారు. ఆ తరువాత- ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో కలిసి దేశ రాజధానిలో ఓ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

గుజరాత్‌లో బ్యానర్లు..
ఈ పరిణామాల మధ్య- కేసీఆర్ ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ బ్యానర్లు, ఫ్లెక్సీలు విస్తృతంగా వెలిశాయి. ప్రత్యేకించి- గుజరాత్‌లో. కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ గుజరాత్‌లో పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

టెక్స్‌టైల్ హబ్‌లో..
గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్, నవ్‌సారి, వాపి, వడోదర వంటి నగరాల్లో బ్యానర్లు కనిపించాయి. సూరత్‌ను మినీ తెలంగాణగా పిలుస్తుంటారు. తెలంగాణకు చెందిన వందలాది మంది సూరత్‌లో నివసిస్తోన్న విషయం తెలిసిందే. టెక్స్‌టైల్ హబ్‌గా సూరత్‌కు గుర్తింపు ఉంది. కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్ వంటి జిల్లాలకు చెందిన పలువురు సూరత్‌లో స్థిరపడ్డారు. అక్కడి వస్త్రపరిశ్రమలలో పని చేస్తోన్నారు.

బంగారు తెలంగాణ సాధకుడిగా..
తమ ముఖ్యమంత్రి పుట్టినరోజును వారంతా ఘనంగా జరుపుకొన్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. బంగారు తెలంగాణ సాధకుడు కే చంద్రశేఖర్ రావు అంటూ గుజరాతీలో ముద్రించిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దేశ్ కీ నేత అంటూ కీర్తించారు. ఈ సంవత్సరం కేసీఆర్ జన్మదినం నాడు ఇదివరకెప్పుడూ లేనివిధంగా బ్యానర్లను నెలకొల్పడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నట్టయింది.

పక్కా ప్రణాళికతో..
థర్డ్‌ఫ్రంట్ ప్రయత్నాలు ఊపందుకుంటోన్న వేళ.. రాజకీయంగా అత్యంత కీలకమైన గుజరాత్‌లో పాగా వేసేలా టీఆర్ఎస్ తన వ్యూహాలను రూపొందించుకుందనే అభిప్రాయాలు లేకపోలేదు. గుజరాత్- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం. ఆ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ప్రచారం చేయడం.. కేసీఆర్ పక్కా ప్రణాళికతో థర్డ్ ఫ్రంట్ విషయంలో ముందుకెళ్తోన్నారనడానికి నిదర్శనంగా భావిస్తున్నారు.

మహారాష్ట్రలోనూ..
అటు మహారాష్ట్రలోనూ కేసీఆర్ బ్యానర్లు వెలుస్తున్నాయి. ఆదివారం ఆయన ముంబైకి వెళ్లనున్న నేపథ్యంలో పలు నగరాల్లో ఆయన పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటవుతున్నాయి. ముంబై, షోలాపూర్, నాగ్‌పూర్ వంటి నగరాల్లో ఇవి ఏర్పాటవుతున్నాయి. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ శివసేన నాయకులు సైతం బ్యానర్లను ఏర్పాటుచేస్తోండటం చర్చనీయాంశమౌతోంది. ఉద్ధవ్ థాకరే-కేసీఆర్ ఫొటోలను ముద్రించిన బ్యానర్లు విస్తృతంగా వెలుస్తున్నాయి.












Click it and Unblock the Notifications