వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్ కపూర్‌ను కలిసేందుకు పాకిస్తానీ సైనికులు వచ్చినప్పుడు ఏమైందంటే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

రాజ్‌ కపూర్ చేసే ప్రతిపనికీ ఏదో ఒక కారణం ఉంటుంది. ఆయన కళ్లు, చెవులు ఎప్పుడూ కొత్త సంగతులను అన్వేషిస్తుంటాయి. ఆయన బుర్ర చాలా తెలివైనది.

ఎలాంటి సృజనాత్మక పనికైనా భయం, ఓటమి, అవమానం, ఆప్తులను కోల్పోవడం, దగ్గర వారి నుంచి విడిపోవడం లాంటి నెగెటివ్ భావాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆయన చెబుతుంటారు. ఈ భావాలు జీవితంపై అవగాహనను పెంచుతాయని, సృజనాత్మకతకు పదును పెడతాయని ఆయన అంటారు.

''రాజ్ కపూర్: ద మాస్టర్ ఎట్ వర్క్’’ పుస్తకంలో ప్రముఖ డైరెక్టర్ రాహుల్ రవైల్ ఈ విషయాలను రాసుకొచ్చారు. రాజ్ కపూర్‌తో కలిసి పనిచేసే అవకాశం రాహుల్‌కు దక్కింది. అంతేకాదు రాజ్ కపూర్ జీవితాన్ని ఆయన దగ్గర నుంచి పరిశీలించారు. చాలా మందికి తెలియని సంగతులను రాహుల్ ఈ పుస్తకంలో వివరించారు.

''నేను అప్పుడే 12వ తరగతి పరీక్షలు రాశాను. 'రాజ్ కపూర్ సినిమా మేరా నామ్ జోకర్‌లో సర్కస్ సన్నివేశాలను ఆజాద్ మైదాన్‌లో చిత్రీకరిస్తున్నారు. అక్కడకు వెళ్దాం. చిన్నచిన్న బట్టలు వేసుకునే అందమైన రష్యన్ అమ్మాయిలను చూడొచ్చు’అని నా బాల్య స్నేహితుడు రిషి కపూర్ చెప్పాడు.’’

''నేను వెంటనే అక్కడకు బయలుదేరాను. మొదట రష్యన్ అమ్మాయిలు నా దృష్టిని ఆకర్షించారు. కానీ, రాజ్ కపూర్ అంకుల్‌ని దగ్గరుండి చూసినప్పుడు నేను అన్ని విషయాలూ మరచిపోయాను. ఆయన పనితీరు నన్ను కట్టిపడేసింది.’’

రాజ్ కపూర్‌ను చూసి మంత్రముగ్ధుడైన రాహుల్ ఆ తర్వాత 15 రోజులూ 'మేరా నామ్ జోకర్’ షూటింగ్ చూడటానికి వెళ్లారు. రాహుల్ ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లాల్సి ఉంది. అయితే, దానికి ఇంకా ఏడు నెలల సమయం ఉంది. దీంతో ఈ సమయంలో రాజ్ కపూర్‌కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తానని తండ్రిని రాహుల్‌ ఒప్పించారు.

దీంతో రాహుల్‌ను తండ్రే స్వయంగా రాజ్ కపూర్‌కు పరిచయం చేశారు. మరోవైపు తనకు రాహుల్ అసిస్టెంట్‌గా ఉండేందుకు రాజ్ కపూర్ కూడా అంగీకరించారు. ఆ తర్వాత ఆయనే మార్గదర్శిగా, స్నేహితుడిగా మారారు. కొన్ని రోజుల్లోనే రాజ్ కపూర్ గొప్ప ఆలోచనాపరుడని, అలాంటి వారు ప్రపంచంలో చాలా కొద్దిమందే ఉంటారనే విషయాన్ని రాహుల్ గ్రహించారు.

బాబీ డిస్ట్రిబ్యూటర్ లుంగీ ఊడదీశారు..

రాజ్ కపూర్ సినిమాలకు తమిళనాడులో రమణ్ అనే వ్యక్తి డిస్ట్రిబ్యూటర్‌గా ఉండేవారు. రమణ్ చనిపోయిన తర్వాత, ఆయన కుమారుడు బాబు తండ్రి బాధ్యతలు తీసుకున్నారు.

బాబీ సినిమా హిట్ అయ్యింది. అయితే, లాభాల్లో వాటాను రాజ్ కపూర్‌కు బాబు పంపలేదు. దీంతో రాజ్ కపూర్‌కు బాగా కోపం వచ్చింది. ఒక రోజు రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు, రమణ్ సాహిబ్ ఇంటికి కారును పోనిమ్మని డ్రైవర్‌కు రాజ్ కపూర్ చెప్పారు.

''అక్కడకు వెళ్లిన వెంటనే, కారు నుంచి బయటకు దిగి 'బాబు.. బాబు..’ అంటూ రాజ్ కపూర్ పెద్దగా అరవడం మొదలుపెట్టారు. ఆ అరుపులకు చుట్టుపక్కల వారంతా వచ్చారు. ఆ సమయంలో లుంగీ కట్టుకున్న బాబు నడుచుకుంటూ వచ్చారు. ఆయన ఒంటిపై మరే బట్టలూ లేవు’’అని రాహుల్ వివరించారు.

''బాబీ సినిమా ప్రాఫిట్ ఎక్కడ? అని అడిగారు? అవి భద్రంగా నాతోనే ఉన్నాయని బాబు చెప్పాడు. దీంతో 'నీ దగ్గర ఎందుకున్నాయి? అవి నాకెందుకు పంపలేదు’అని గట్టిగా రాజ్ కపూర్ అరిచారు. దీంతో రేపు ఇస్తానని బాబు సమాధానం ఇచ్చారు. వెంటనే బాబు లుంగీని రాజ్ కపూర్ లాగేశారు. దీంతో అందరిముందు బాబు నాగ్నంగా నిలబడిపోయారు. 'రేపు ఉదయం డబ్బులు ఇచ్చి నీ లుంగీని తీసుకెళ్లు’ అంటూ అక్కడి నుంచి కోపంతో రాజ్ కపూర్ వచ్చేశారు’’అని రాహుల్ వివరించారు.

రాజ్ కపూర్: ద మాస్టర్ ఎట్ వర్క్

బస్టాండ్‌లో రాజ్ కపూర్

ఒక రోజు ఉదయం మూడు గంటలైంది. రాహుల్‌ను పొరుగున్నవారు నిద్ర లేపారు. మీ ఇంటికి సమీపంలో వీధి కుక్కలతో రాజ్ కపూర్ ఆడుకుంటూ కనిపించారని వారు రాహుల్‌కు చెప్పారు. వెంటనే రాజ్ కపూర్‌ను వెతుక్కుంటూ రాహుల్ బయలుదేరారు. అయితే, ఎక్కడా రాజ్ కపూర్ కనిపించలేదు.

ఆ తర్వాత కొద్దిసేపటికి రాజ్ కపూర్ కారు డ్రైవర్ కారుతోపాటు రాహుల్ ఇంటికి వచ్చారు. ''రాజ్ సర్ మధ్యలోనే కారు దిగిపోయారు. కొద్దిసేపు కుక్క పిల్లలతో ఆడుకున్నారు. ఆ తర్వాత కారు తీసుకుని ఇంటికి వెళ్లు, నేను నడుచుకుంటూ వస్తానని చెప్పారు’’అని ఆ డ్రైవర్ చెప్పారు.

దీంతో రాహుల్ తన కారును తీసుకొని ఆ డ్రైవర్ చెప్పిన చోటుకు రాజ్ కపూర్‌ను వెతికేందుకు వెళ్లారు.

''నేను అక్కడా, ఇక్కడా అంటూ చాలా చోట్లు వెతికాను. చివరగా ఒక బస్టాండ్‌లో రాజ్ కపూర్ కనిపించారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అని ఆయన్ను ప్రశ్నించాను. దీంతో ఎవరైనా బస్టాండులో ఏం చేస్తారు? అంటూ ఆయన కోపంతో అడిగారు. బస్సు వచ్చేందుకు 5.30 వరకు అవుతుంది. పదండి వెళ్లిపోదామని ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నించాను. కానీ ఫలితం లేకపోయింది.’’

''నేను ఉదయం 5.30 వరకు ఇక్కడే ఉంటాను. బస్సు వచ్చాకే ఇంటిక వస్తాను. నువ్వు ఇక్కడ ఉండకు వెళ్లు.. నీ మొహం నాకు చూపించకు’’అని రాజ్ కపూర్ గట్టిగా అన్నారు. దీంతో ఆయన్ను శాంతపరిచేందుకు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాను. మరో రౌండ్ కొట్టి మళ్లీ అక్కడకు వచ్చేసరికి బస్టాండ్‌లో ఆయన కనిపించలేదు. ఆయన క్యాబ్ తీసుకుని వెళ్లిపోయారేమో అనుకున్నాని శాంతా క్రూజ్ వైపు వెళ్లాను.

''కొద్దిసేపటి తర్వాత ఓ ట్యాక్సీలో రాజ్ కపూర్ కనిపించారు. ట్యాక్సీలో డ్రైవర్, మరో వ్యక్తి మధ్యలో ఆయన కూర్చున్నారు. తన రెండు చేతులను పక్కనున్న ఇద్దరిపై వేశారు. ఆయన తలకు స్కార్ఫ్ కూడా కట్టి ఉంది. నేను కారుకు దగ్గరగా వెళ్లినప్పుడు.. 'సున్ సాహిబా సున్, ప్యార్ కీ ధున్’ పాట పాడుతూ ఆయన కనిపించారు.’’

సినిమా అంటే అమితమైన ప్రేమ

''అది 11ఏళ్లకు మునుపటి ఆయన సినిమా రామ్ తేరీ గంగా మైలీలో పాట. ఇంటికి చేరుకున్న తర్వాత, ఆ ఇద్దరినీ హత్తుకుని రాజ్ కపూర్ గుడ్ బాయ్ చెప్పారు. ట్యాక్సీ డబ్బులు కట్టకుండా ఇంటిలోకి వెళ్లిపోయారు. బిల్ ఎంతైందని నేను ఆ ట్యాక్సీ డ్రైవర్‌ను అడిగాను. అయితే, రాజ్ కపూర్ క్యాబ్ ఎక్కితే బిల్లు ఎవరు అడుగుతారు? అంటూ ఆ డ్రైవర్ సమాధానం ఇచ్చారు.’’

''ఆ మరుసటి రోజు రాజ్ కపూర్ సెక్రటరీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. భోజనానికి ఆయన ఇంటికి రమ్మన్నారని చెప్పారు. దీంతో అక్కడకు వెళ్లాను. ముందురోజు జరిగిన ఘటనను నేను ప్రస్తావించలేదు. 'నేను మీ ఇంటికి వచ్చానని నాకు గుర్తుంది. బస్టాప్‌లో నిలబడటం, నేను ట్యాక్సీ ఎక్కడం, నువ్వు వెనక రావడం అంతా గుర్తింది’అని చెప్పారు. 'ట్యాక్సీ డ్రైవర్‌కు డబ్బులు ఎంత ఇచ్చావు’అని ఆయన అడిగారు. డ్రైవర్ డబ్బులు తీసుకోలేదని చెప్పాను. వెంటనే అయితే, వారికి నా పాట నచ్చిందా? అని అడిగారు. ముందు రోజు ఆయన మద్యం సేవించి ఉన్నారు. అయినప్పటికీ సినిమాల చుట్టూనే ఆయన ఆలోచనలు తిరుగుతున్నాయి.’’

గుల్షన్ రాయ్‌తో మాటల యుద్ధం

రాజ్ కపూర్ 'మేరా నామ్ జోకర్’ సినిమా తీసిన సమయంలోనే, గుల్షన్ రాయ్ 'జానీ మేరా నామ్’ సినిమాను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాల పేర్లు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. మేరా నామ్ జోకర్‌కు ముందే జానీ మేరా నామ్ విడుదలైంది. మంచి విజయమూ అందుకుంది. రాజ్ కపూర్ సినిమా పెద్దగా ఫలితం చూపలేకపోయింది.

ఆ సినిమాల పేర్లపై అప్పట్లో చాలా జోకులు పేలేవి. నాలుగేళ్ల తర్వాత, బాబీ పేరుతో రాజ్ కపూర్ మరో సినిమా తీశారు. ఇది మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక పార్టీలో గుల్షన్‌ను రాజ్ కపూర్ కలిశారు. ''నేను మేరా నామ్ జోకర్ సినిమా తీసినప్పుడు.. నువ్వు జాన్ మేరా నామ్ తీశావు. ఇప్పుడు నేను బాబీ తీశాను. నువ్వు దేనికి ప్లాన్ చేస్తున్నావు? టాబీకా?’’అని అడిగారు.

సరిహద్దుల్లో సైనికులతో

బాబీ సినిమా షూటింగ్ కోసం రాజ్ కపూర్ కశ్మీర్ వెళ్లారు. ఒక సైనిక శిబిరం ముందు నుంచి వెళ్లేటప్పుడు ఆయనకు బారికెడ్లు కనిపించాయి. ఇంతకంటే ముందుకు వెళ్లడం కుదరదని సైనికులు వారికి చెప్పారు. అయితే, రాజ్ కపూర్ వచ్చారని మీ కమాండర్‌కు చెప్పండని ఆయన అన్నారు.

వెంటనే రాజ్ కపూర్‌ను కలిసేందుకు ఆ కమాండర్ వచ్చారు. అంతేకాదు భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పర్యటించేందుకు వీరికి రెండు జీపులు కూడా ఏర్పాటుచేశారు.

''మేం సరిహద్దులకు వెళ్లినప్పుడు, అక్కడి జవాన్లు మా కోసం ఎదురుచూస్తూ కనిపించారు. ఎందుకంటే రాజ్ కపూర్ వస్తున్నారని వారికి ముందే వైర్‌లైస్ ఫోన్ల నుంచి సమాచారం అందింది. మా కోసం అక్కడ పకోడీలు, సమోసాలు ఏర్పాటుచేశారు. మేం వెనక్కి వెళ్లేటప్పుడు 'సర్ కాసేపు వేచివుండగలరా?’అంటూ వారు మమ్మల్ని అడిగారు. ఎందుకని ప్రశ్నించగా.. మేం పాకిస్తానీ సైనికులకు కూడా మీరు వస్తున్నారని సమాచారం ఇచ్చామని అన్నారు. కాసేపటికి రెండు జీపుల్లో పాకిస్తానీ సైనికులు అక్కడకు చేరుకున్నారు. వారు రాజ్ కపూర్ కోసం జిలేబీలు, స్వీట్లు తీసుకొచ్చారు. పాకిస్తాన్‌లోనూ రాజ్ కపూర్‌కు అభిమానులు ఉన్నారన్న విషయం తెలుసుకొని మేం భావోద్వేగానికి గురయ్యాం’’అని రాహుల్ వివరించారు.

తాష్కెంట్‌లోనూ పాపులర్

పాకిస్తాన్‌తోపాటు చాలా దేశాల్లో రాజ్ కపూర్‌కు అభిమానులు ఉన్నారు. 2007లో రాజ్ కపూర్‌పై ఓ షో చేసేందుకు రణ్‌ధీర్ కపూర్, రిషి కపూర్, నితిన్ ముఖేశ్, రాహుల్ రవైల్ కలిసి తాష్కెంట్ వెళ్లారు. అక్కడ వారికి తాను రాజ్ కపూర్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని రాహుల్ పరిచయం చేసుకున్నారు.

వీరంతా ఒక స్థానిక మార్కెట్‌కు వెళ్లినప్పుడు, రాజ్ కపూర్ పిల్లలు, ఆయనతో పనిచేసిన వారిని చూసేందుకు జనం పెద్దయెత్తున వచ్చారు.

''ఆ జనం మధ్యలో నుంచి ఓ వృద్ధురాలు నా దగ్గరకు వచ్చారు. 'నువ్వు రాజ్ కపూర్ అసిస్టెంట్‌గా పనిచేశావా? అని అడిగారు. ఓ ట్రాన్స్‌లేటర్ దాన్ని హిందీలోకి అనువదించారు. నేను వెంటనే అవునని చెప్పాను. అంటే మీకు రాజ్ కపూర్‌ను ముట్టుకునే అవకాశం వచ్చిందా? అని ఆమె అడిగారు. ఆ ప్రశ్న నాకు కాస్త వింతగా అనిపించింది. వెంటనే ఆమె నా చేతిని తన చేతిలోకి తీసుకొని ఏడ్వడం మొదలుపెట్టారు. నా కళ్లు కూడా వెంటనే చెమర్చాయి. అలాంటి అనుభూతిని నేను ముందెన్నడూ పొందలేదు’’అని రాహుల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
This is what happened when Pakistani soldiers came to meet Raj Kapoor
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X