మధ్యప్రదేశ్ లో గెలిచేదెవరు ? క్లారిటీ ఇచ్చేసిన టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే..
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత కీలకమైన మధ్యప్రదేశ్ పైనే అందరి దృష్టీ నెలకొంది. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ లో అధికార బీజేపీ మరోసారి గెలిచేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా సహా పార్టీ పెద్దలంతా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విపక్ష కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న గట్టి పోటీయే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయన్న దానిపై టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే ప్రకటించింది.
టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్ లో అధికార బీజేపీ కంటే విపక్ష కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 230 స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ 112-122 సీట్లు గెల్చుకునే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది. అలాగే బీజేపీ 107-115 సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే వెల్లడించింది. ఇతరులకు 1 నుంచి 3 సీట్లు గెల్చుకునే అవకాశాలున్నట్లు తెలిపింది. అలాగే ప్రాంతాల వారీగా కూడా ఆయా పార్టీల ఆధిక్యాన్ని ఈ సర్వే బయటపెట్టింది.

మధ్యప్రదేశ్ లోని మాల్వా నిమర్ ప్రాంతంలో ఉన్న 66 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 43-47 సీట్లు గెల్చుకునే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే తెలిపింది. ఇక్కడ బీజేపీకి 18-22 సీట్లు మాత్రమే లభించే అవకాశం ఉందని వెల్లడించింది. అటు మహాకౌశల్, గ్వాలియర్, చంబల్ ప్రాంతంలో కాంగ్రెస్, బీజేపీకి మధ్య గట్టి పోటీ నెలకొందని తెలిపింది. ఇందులో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉందని తెలిపింది. మహాకౌశల్ లో కాంగ్రెస్ కు 18-22, బీజేపీకి 16-20 సీట్లు లభించే అవకాశం ఉంది. అలాగే గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో కాంగ్రెస్ కు 16-20 సీట్లు, బీజేపీకి 14-18 సీట్లు లభిస్తాయని తెలిపింది.
మధ్యభారత్, వింధ్య ప్రాంతాల్లో బీజేపీకి స్వల్ప ఆధిక్యం లభిస్తోందని సర్వే తెలిపింది. మధ్యభారత్ లో బీజేపీ 22-24 సీట్లు, కాంగ్రెస్ 12-24 సీట్లు పొందే అవకాశం ఉంది. వింధ్య ప్రాంతంలోని 30 సీట్లలో బీజేపీ 19-21 సీట్లు, కాంగ్రెస్ 8-10 సీట్లు గెల్చుకుటుందని తెలిపింది. మళ్లీ బుందేల్ ఖండ్ ప్రాంతంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ తప్పదని తేలిపోతోంది. ఇక్కడ బీజేపీకి 13-15, కాంగ్రెస్ కు 11-13 సీట్లు లభించే అవకాసం ఉందని తెలిపింది.












Click it and Unblock the Notifications