తిరుమల లడ్డూ వివాదాన్ని వాళ్లు క్యాష్ చేసుకున్నారు
Tirumala Laddu row: పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది.
కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది.

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు- సరికొత్త వివాదానికి తెర తీసినట్టయింది.
ఈ పరిణామాల మధ్య కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి వివాదం తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. పవిత్రమైన ఆలయ వ్యవస్థ గానీ, మూలవిరాట్టుకు పెట్టే నైవేద్యాలు, భక్తులకు పంచే ప్రసాదాల వ్యవహారంలో ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వని విధంగా నిర్ణయాలను తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా గల అన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీలో కర్ణాటక పాల సమాఖ్య ఉత్పత్తి చేస్తోన్న నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలంటూ సిద్ధరామయ్య ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కర్ణాటక దేవాదాయ శాఖ అన్ని ఆలయాలకు ఓ సర్కులర్ పంపించింది.

కర్ణాటక వ్యాప్తంగా 35 వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి. ధర్మస్థల శ్రీమంజునాథ, మైసూరు చాముండేశ్వరి, కుక్కే సుబ్రహ్మణ్య, నంజనగూడు నంజుండేశ్వర స్వామి, మంగళూరు మహతోబా మంగళాదేవి, ఉడుపి శ్రీకృష్టదేవస్థానం, కొల్లూరు మూకాంబికా, సిగందూరు చౌడేశ్వరి, కటీలు శ్రీ దుర్గాపరమేశ్వరి, శృంగేరి శ్రీశారదాంబ, హొరనాడు అన్నపూర్ణేశ్వరి.. వంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
దాదాపుగా 90 శాతానికిపైగా గల ఆలయాల్లోనూ ప్రసాదాల తయారీలో నందిని నెయ్యినే వినియోగిస్తోన్నారని దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. మిగిలిన ఆలయాలేవైనా ఉంటే వాటిల్లో కూడా నందిని ఘీని మాత్రమే వాడాలనే ఉద్దేశంతో ఈ సర్కులర్ జారీ చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications