మళ్లీ వివాదాలను కొని తెచ్చుకున్న ఉదయనిధి స్టాలిన్.. కేసు నమోదు
తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. కొద్దిరోజుల కిందటే త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఈ వివాదం ముగిసీ ముగియంగానే ఇప్పుడు మరోసారి ఆయన.. వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. తిరుప్పూర్ జిల్లా పోలీసులు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఉప ఎన్నికల పోలింగ్ ముంగిట ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తిరుప్పూర్ జిల్లా ధరాపురం పెరియార్ విగ్రహం వద్ద శనివారం రాత్రి నిర్వహించిన ఉప ఎన్నికల బహిరంగ ప్రచార సభలో ఈ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఉదయనిధి స్టాలిన్.. చిన్న పిల్లలను ప్రచారంలోకి దించారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యమంత్రి విజయ్ పట్ల కూడా అవమానకరంగా, ఆయనను కించపరిచేలా ఓ చిన్నారితో మాట్లాడించారని టీవీకే నేతలు ధారాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ పూర్తి స్థాయిలో అమల్లో ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రచారాలలో కూడా మైనర్లు, చిన్న పిల్లలను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఉపయోగించకూడదు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ విషయం స్పష్టంగా పొందుపరిచారు. వీటిని ఉదయనిధి స్టాలిన్ ఉల్లంఘించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచార సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తోన్న సమయంలో ఓ బాలుడు ఆయన వాహనంపైకి ఎక్కాడు. తన మెడలో ఉన్న కండువాను ఆ బాలుడి మెడలో వేశారు ఉదయనిధి స్టాలిన్. తన కాలర్ మైక్ ను ఆ బాలుడి ముందు ఉంచి మాట్లాడించాడు. ఆ బాలుడు చేసిన వ్యాఖ్యలు ఏమిటి, ఏ రకంగా ముఖ్యమంత్రి పట్ల అగౌరవంగా మాట్లాడించారు. ఈ ఉదంతం వివాదానికి దారి తీసింది. ఆయనపై కేసు నమోదు కావడానికి కారణమైంది.
ఈ వ్యవహారంపై డీఎంకే గానీ, ఉదయనిధి స్టాలిన్ గానీ ఇప్పటివరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఉప ఎన్నికల సమయంలో అధికార టీవీకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, తమ విజయాన్ని అడ్డుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తోందంటూ డీఎంకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నికల రణరంగం రసవత్తరంగా మారుతున్న తరుణంలో ప్రతిపక్ష నాయకుడిపై కేసు నమోదు కావడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications
