డిసెంబరులో మమతా బెనర్జీ సర్కార్ టార్గెట్??
పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబరుకల్లా కూలిపోనుందని భారతీయ జనతాపార్టీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారి ప్రకటించారు. తాను చెబుతున్న విషయంపై నమ్మకం లేకపోతే రాసిపెట్టుకోవాలంటూ సూచించారు. పూర్బా మిడ్నపూర్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలతోపాటే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి కూడా జమిలి ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.
మమతతో విభేదించి బీజేపీలో చేరిన సువేందు శాసనసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. కొద్దిరోజులుగా ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలున్నారని, ప్రభుత్వం కూలిపోతుందంటూ కొంతకాలం నుంచి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఎప్పటిలోగా కూలిపోనుందో ఆయన స్పష్టం చేశారు. బెంగాల్‌తోపాటు జార్కండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర పరిస్థితులే పునరావృతం కాబోతున్నాయంటూ ఆయన చెబుతూ వస్తున్నారు.

Recommended Video

సువేందు అధికారి వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాజకీయ అసహనంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఏం జరుగుతుందో ముందే తెలుసుకునేవారైతే బీహార్‌లో బీజేపీ కూటమి కూలిపోతుందని ఎందుకు చెప్పలేకపోయారని తృణమూల్ కాంగ్రెస్ మంత్రి చంద్రిమ భట్టాచార్య ప్రశ్నించారు. సువేందు అధికారి కొత్తగా జ్యోతిష్యం చెప్పడం నేర్చుకున్నారని, అందరూ చెప్పించుకోవాలంటూ సెటైర్లు వేశారు. బీజేపీ మమతాబెనర్జీ సర్కారును కూల్చివేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వాటన్నింటినీ తిప్పికొడతామని చంద్రిమ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications