కుబేరుడిని మించిన దైవ వైభవం! దేశంలోనే టాప్ 5 ధనిక ఆలయాలు ఇవే!

భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. ఇక్కడి ఆలయాల వైభవం, శిల్పకళా చాతుర్యం ఎంత గొప్పవో.. భక్తులు దేవుడిపై చూపించే అపారమైన నమ్మకం, భక్తి కూడా అంతే అమోఘం. తరతరాలుగా భక్తులు సమర్పిస్తున్న కానుకలు, బంగారం, వెండి, నగదు రూపంలోనే కాకుండా భూముల రూపంలో కూడా దేశంలోని ప్రముఖ దేవాలయాలకు వచ్చి చేరుతున్నాయి. ఈ అపారమైన భక్తి కానుకల వల్లే మన దేశంలోని కొన్ని ఆలయాల ట్రస్టులు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ఆర్థికంగా బలమైన ఆధ్యాత్మిక సంస్థలుగా అవతరించాయి.

దేశంలో అధికారికంగా ధనిక దేవాలయాల జాబితా అంటూ ప్రభుత్వం ప్రకటించనప్పటికీ.. ఆయా ఆలయాల ట్రస్టులు విడుదల చేసే వార్షిక నివేదికలు, ఆడిట్ లెక్కలు, కోర్టు రికార్డుల ద్వారా వాటి సంపద వివరాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోనే అత్యంత ధనికమైన ఐదు ప్రముఖ దేవాలయాల విశేషాలను వన్ ఇండియా తెలుగు ప్రత్యేకంగా మీకు అందిస్తున్న కథనం.

Top 5 Richest Temples in India Sree Padmanabhaswamy and Tirupati Balaji Lead with Massive Wealth

1. శ్రీ పద్మనాభస్వామి ఆలయం (కేరళ)

కేరళ రాజధాని తిరువనంతపురంలో కొలువై ఉన్న శ్రీ పద్మనాభస్వామి ఆలయం దేశంలోనే అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయంలోని రహస్య నేలమాళిగలు తెరిచినప్పుడు బయటపడ్డ గుప్తనిధులు ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడి గదులను పరిశీలించినప్పుడు పురాతన బంగారు విగ్రహాలు, వజ్రాలు పొదిగిన అభరణాలు, అత్యంత అరుదైన బంగారు నాణేలు వెలుగుచూశాయి. కేవలం తెరిచిన గదులలోని సంపద విలువనే సుమారు రూ. 1.2 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేయగా, ఈ పురాతన నిధుల చారిత్రక, సాంస్కృతిక విలువ లెక్కిస్తే ఇది అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు.

2. తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఆలయం (ఆంధ్రప్రదేశ్)

సంపద పరంగా పద్మనాభస్వామి ఆలయం ముందున్నా.. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతూ.. నిత్య పూజలు, నిరంతర భక్తజన ప్రవాహంతో నడిచే క్రియాశీల ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే అత్యంత ధనిక దేవాలయ ట్రస్ట్‌గా నిలుస్తోంది. ఇటీవల టీటీడీ విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం.. తిరుమల శ్రీవారి పేరిట ఉన్న బంగారం, స్థిరాస్తులు, బ్యాంకు డిపాజిట్ల విలువ అక్షరాలా రూ. 2.26 లక్షల కోట్లుగా ఉంది. ఇది కాకుండా ఆలయానికి వివిధ సేవల ద్వారా ఏటా రూ. 5,100 కోట్లకు పైగా ఆదాయం వస్తుండగా.. కేవలం భక్తులు హుండీలో సమర్పించే కానుకల రూపంలోనే ప్రతి సంవత్సరం సుమారు రూ. 1,500 కోట్లు జమ అవుతుండటం విశేషం.

3. షిరిడీ సాయిబాబా ఆలయం (మహారాష్ట్ర)

మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడీ సాయిబాబా సంస్థాన్ దేశంలోనే అతిపెద్ద సేవా సంస్థలలో ఒకటిగా విరాజిల్లుతోంది. ముంబైకి దాదాపు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఏటా కోట్లాది మంది భక్తులు తరలివస్తుంటారు. సాయిబాబా సంస్థాన్ పేరిట వివిధ బ్యాంకుల డిపాజిట్లు, విలువైన బంగారం, వెండి ఆభరణాల రూపంలో సుమారు రూ. 2,500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.

భక్తుల విరాళాల ద్వారా ఏటా రూ. 400 కోట్ల నుంచి రూ. 700 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. ఈ నిధులను కేవలం ఆలయ నిర్వహణకే కాకుండా.. ఉచిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, నిత్యాన్నదాన వితరణ వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ ట్రస్ట్ ఖర్చు చేస్తోంది.

4. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం (కేరళ)

దక్షిణ భారతదేశపు 'ద్వారక'గా పిలవబడే కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి కూడా సుదీర్ఘమైన ఆర్థిక నేపథ్యం ఉంది. భక్తుల సమర్పణలు, ఆలయ స్థిరాస్తులు, ఇతర పెట్టుబడుల ద్వారా ఈ దేవాలయానికి దాదాపు రూ. 1,700 కోట్ల నుంచి రూ. 2,500 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు అంచనా. గురువాయూర్ దేవస్వమ్ బోర్డు పర్యవేక్షణలో నడిచే ఈ ఆలయానికి ఏటా రూ. 250 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ఈ నిధులలో ఎక్కువ భాగాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సంస్కృత పాఠశాలలు, ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు.

5. మాతా వైష్ణో దేవి ఆలయం (జమ్మూ కాశ్మీర్)

జమ్మూ కాశ్మీర్‌లోని కాట్రా కొండలపై వెలసిన శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయం దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. వైష్ణో దేవి శ్రైన్ బోర్డు పరిధిలో నడిచే ఈ ఆలయానికి రూ. 2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి. భక్తులు సమర్పించే కానుకలతో పాటు హెలికాప్టర్ సేవలు, గదుల అద్దెలు, యాత్రికుల కోసం కల్పించే ఇతర సౌకర్యాల ద్వారా బోర్డుకు పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. గడిచిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ శ్రైన్‌ బోర్డుకు రూ. 683 కోట్ల ఆదాయం రాగా, అందులో కేవలం భక్తులు సమర్పించిన విరాళాల విలువనే రూ. 255 కోట్లుగా నమోదైంది.

గుప్త నిధులు వర్సెస్ వార్షిక విరాళాలు

సాధారణంగా ఒక ఆలయ సంపదను ఆ సంస్థకు ఉన్న బంగారం, వెండి, భూములు, బ్యాంకు డిపాజిట్ల (ఆస్తుల) ఆధారంగా లెక్కిస్తారు. ఈ లెక్కన చూస్తే నిల్వ ఉన్న గుప్తనిధుల పరంగా కేరళలోని పద్మనాభస్వామి ఆలయం అత్యంత ధనికమైనది. కానీ, భక్తులు నిత్యం సమర్పించే విరాళాలు, ఏటా వచ్చే హుండీ కానుకల పరంగా చూస్తే మాత్రం తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయానికి సాటి మరే దేవాలయం భారతవనీలో లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+