నవంబర్ లో సందర్శించాల్సిన అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఇవే..!
భారత్ లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఒక్కో సీజన్ లో ఒక్కో పర్యాటక ప్రాంతం టూరిస్టులను అలరిస్తూ ఉంటుంది. ఇక చలికాలంలో భారత్ లో సందర్శించేందుకు అనువైన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తే చాలా రీఫ్రెషింగ్ గా ఉండటంతోపాటు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. కుటుంబంతో కలిసి హాయిగా ఈ వింటర్ ట్రిప్ ను ఎంజాయ్ చేయవచ్చు.
ఇక దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో కూర్గ్ ఒకటి. పచ్చని ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా ఈ ప్రాంతం ఉంటుంది. ఎటు చూసినా కాఫీ తోటలు, అందమైన జలపాతాలు, చారిత్రక కట్టడాలు ఇలా ఒకటా రెండా ఇక్కడ చూసేందుకు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నవంబర్ నెలలో కూర్గ్ ప్రాంతం మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుంది. ఈ సమయంలో వాతావరణం సాధారణంగా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ట్రెక్కింగ్ చేసేవారికి ఇది అనువైన టూరిస్ట్ ప్రాంతంగా చెబుతారు. ఇక్కడి అబ్బే జలపాతం, రాజాస్ సీట్ తదితర పర్యాటక ప్రాంతాలు అబ్బురపరుస్తాయి.
అలాగే మరో ముఖ్యమైన పర్యాటక ప్రాంతం కేరళలోని అలప్పుజా. ఈ ప్రాంతాన్ని వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ గా చెబుతారు. చుట్టూ బ్యాక్ వాటర్స్ తో నిండి ఉన్న ప్రాంతం అలప్పుజా. పచ్చని కొబ్బరి తోటలు, కాలువలు, హౌజ్ బోట్లలో ప్రయాణం ఇక్కడ మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రాంతంలోనే ఏటా స్నేక్ బోట్ రేస్ కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా గడపడానికి ఈ ప్రాంతం బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. అలాగే నవంబర్ లో అలప్పుజాలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇక నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో పర్యటించాలని కోరుకునేవారికి మేఘాలయలోని షిల్లాంగ్ ఓ ముఖ్యమైన టూరిస్ట్ ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలోని పచ్చని కొండలు, అందమైన జలపాతాలు, లోయలు, కొండలు.. కోనలు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఈ హిల్ స్టేషన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్రకృతి సౌందర్యంతో పాటు స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలనుకునేవారికి కూడా ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది. షిల్లాంగ్ లో ఏటా చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ నెల 20, 21 తేదీల్లో వెళితే చెర్రీ బ్లాసమ్ అందాలను చూసే అవకాశం ఉంది. ఈ పర్యాటక ప్రాంతాలతో పాటు నవంబర్ లోని కార్తికమాసంలో ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో పర్యటించవచ్చు.

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వారణాసి ఒకటి. ఇక్కడి ప్రసిద్ధమైన కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించడంతో పాటు సాయంత్రం జరిగే గంగా హారతిని వీక్షించవచ్చు. వారణాసి టెంపుల్ సిటీలో తెల్లవారుజామున గంగానదిలో పడవ ప్రయాణం చేస్తూ ఘాట్ల అందాలను వీక్షించడం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications
