ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. పలువురికి గాయాలు..
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు టైర్ పేలడంతో అదుపుతప్పి రెండు కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా కారులో ప్రయాణిస్తున్నవారేనని పోలీసులు స్పష్టం చేశారు. కడలూరు జిల్లా తీత్తకుడి సమీపంలోని తిరుచి చెన్నై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
తమిళనాడులోని కడలూరు జిల్లా తీత్తకుడి సమీపంలోని రహదారిపై దారుణమైన ఘటన జరిగింది. తిరుచిరాపల్లి నుంచి చెన్నైకు ప్రయాణిస్తున్న తమిళనాడు ప్రభుత్వ ఆర్టీసీ బస్సు టైర్లు పంక్చర్ కావడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి.. మరోవైపు ఉన్న జాతీయ రహదారిపై వస్తున్న రెండు కార్లపైకి దూసుకెళ్లింది. బస్సు అతివేగంగా వచ్చి రెండు కార్లను ఢీ కొట్టడంతో కార్లలో ప్రయాణిస్తున్న 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు.

ప్రమాదం ధాటికి ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు ఇటు అటుగా పడిపోవడంతో మరికొంతమందికి గాయాలయ్యాయి. వారిని పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించారు. అలాగే కారులో చిక్కకుపోయిన వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో చెన్నై- తిరుచి నేషనల్ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. బస్సు టైర్ పంక్చర్ కావడం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వివరించారు.












Click it and Unblock the Notifications