ఇంజనీరుకన్నా రైలు డ్రైవర్ జీతమే ఎక్కువ!
ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి పోటీపరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగుల మొట్ట మొదటి ఎంపిక రైల్వే డిపార్ట్ మెంట్. మంచి వేతనంతోపాటు పలు సౌకర్యాలు కూడా లభిస్తుండటమే ఇందుక్కారణం. ప్రతి ఒక్కరూ రైల్వేలో ఉద్యోగం కోసమే ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు.. వారికి ఉచిత ప్రయాణం కూడా ఉంటుంది. ఇటీవలే జరిగిన ఎన్టీపీసీ పరీక్షకు కోట్లల్లో దరఖాస్తులు వచ్చాయి. రైల్వేలో అన్ని విభాగాలకన్నా లోకో పైలెట్ (ట్రైన్ డ్రైవర్) ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడినదై ఉంటుంది.
లోకో పైలెట్లకు ఇంజనీర్ల కంటే ఎక్కువ జీతం ఉంటుంది. వీరి ఉద్యోగ విధులు కఠినతరంగా ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే వేతనాలుంటాయి. ప్రతిరోజు రైళ్ళల్లో లక్షల సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత లోకో పైలెట్ పై ఉంటుంది. పగలు, రాత్రి, ఎండ, వాన, తుఫాను.. ఇలా దేనితోను వీరికి సంబంధం ఉండదు. వారి విధి వారు నిర్వర్తించాల్సిందే.

అప్రమత్తంగా లేకుండా కొంచెం ఏమరుపాటుగా ఉన్నా సరే ప్రమాదం ముంచుకొస్తుంది. అందుకే వీరికి వేతనం ఎక్కువగా చెల్లిస్తారు. వీరి రోజువారీ దినచర్య స్థిరంగా ఉండదు. రోస్టర్ ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 14 రోజుల రోస్టర్ పైలెట్ కు ఇస్తారు. ఇందులో 2 రోజులు విశ్రాంతి ఉంటుంది. ఈ రోస్టర్ ప్రకారం దాదాపు 104 గంటలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ముందుగా ఏఎల్ పీగా (అసిస్టెంట్ లోకో పైలెట్) చేరతారు. 100 కిలోమీటర్లు నడిచే రైలులో అలవెన్స్, ఓవర్ టైం అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, హాలిడే అలవెన్స్, డ్రెస్ అలవెన్స్ తదితరాలుంటాయి.
ALP నుంచి LPకి అంటే లోకో పైలట్‌గా పదోన్నతి పొందినప్పుడు అన్ని అలవెన్స్‌లతో పాటు వారి జీతం అనేక రెట్లు పెరుగుతుంది. రూ.లక్ష వరకు ఉంటుంది. డ్యూటీ కూడా చాలా కష్టం. ఇంటికి తిరిగి రావడానికే మూడు నుంచి నాలుగురోజుల సమయం పడుతుంది. రోస్టర్ లో ఇచ్చిన 104 గంటల కంటే ఎక్కువ సమయం వెచ్చిస్తే ఓవర్ టైం చేసినందుకు అలవెన్స్ ఇస్తారు. విధి నిర్వహణ వేళలు క్లిష్టంగా ఉండటంవల్ల లోకో పైలెట్లుగా ఉండటానికి ఎవరూ ముందుకు రావడంలేదు. కొన్ని సంవత్సరాలుగా భారతీయ రైల్వేలో మహిళలు లోకో పైలెట్లుగా పనిచేస్తుండటం విశేషం.












Click it and Unblock the Notifications