బెంగళూరులో పవన్ ఫ్యాన్స్ వీరంగం- ఎఫ్ఐఆర్ నమోదు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ.. ఓజీ. దసరా పండగను పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజీత్ రెడ్డి దర్శకుడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, రావు రమేష్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్.. కీలక పాత్రల్లో నటించారు. 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఇది.
పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ప్రారంభంలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత హిట్ బాట పట్టిందనేది ఇండస్ట్రీ రిపోర్ట్. పవన్ కల్యాణ్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టిందీ మూవీ. ఆయనను ఎలా చూపడాలనుకున్నారో.. అలాగే తెరకెక్కించాడు దర్శకుడు సుజీత్. ఇంటర్వెల్, ఆ తర్వాతి కంటిన్యువేషన్ సీట్లు సినిమాకు ప్రధాన బలంగా సమీక్షకులు చెబుతున్నారు. హరిహర వీరమల్లు డిజాస్టర్ తో డీలా పడ్డ పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఈ మూవీ జోష్ నింపింది.

ఈ మూవీ బెంగళూరులో పవన్ కళ్యాణ్ అభిమానులను కష్టాలను తెచ్చిపెట్టింది. సినిమా విడుదల సందర్భంగా వారు సృష్టించిన గందరగోళంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అభిమానుల ఓవరాక్షన్ కారణంగా సినిమా ప్రదర్శన సైతం వివాదాల్లో చిక్కుకుంది. సినిమా విడుదల సందర్భంగా బెంగళూరులోని సంధ్యా థియేటర్‌లో కొందరు అభిమానులు కత్తులతో హంగామా సృష్టించారు. మడివాళ పోలీసులు రంగంలోకి దిగి ఆ కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అవి నిజమైనవా లేక ప్లాస్టిక్ కత్తులా అని తనిఖీ చేశారు.
ప్రీమియర్ షో సందర్భంగా కొందరు అభిమానులు డీజే పార్టీ ఏర్పాటు చేసి రోడ్లను వాహనాలను సైతం అడ్డగించారు. దీనిపై కన్నడ రక్షణ వేదిక సభ్యులు థియేటర్‌కు చేరుకుని వారిని తరిమికొట్టారు. చట్టాన్ని గౌరవించాలని సూచించారు. సమాచారం తెలిసిన వెంటనే మడివాళ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కన్నడ రక్షణ వేదిక ప్రతినిధుల ఫిర్యాదుతో పవన్ అభిమానులపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డీజే పార్టీ నిర్విహించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సౌండ్ సిస్టమ్, కొన్ని డమ్మీ కత్తులను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications