భారత్ దెబ్బకు వెనక్కి తగ్గిన ట్రంప్..ఈ వయస్సులో ఎందుకు ఇదింతా..!
ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య శాంతి చర్చలకు తానే కారణమని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన వ్యాఖ్యలపై అనూహ్యంగా వెనక్కి తగ్గారు. ఖతార్‌లోని అల్-ఉదైద్ వైమానిక స్థావరంలో అమెరికా సైనిక సిబ్బందితో మాట్లాడుతూ, ఈ సమస్య పరిష్కారానికి తాను సహాయం చేశానని, కానీ మధ్యవర్తిత్వం వహించలేదని స్పష్టం చేశారు.
భారత్ 'ఆపరేషన్ సింధూర్' తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు తానే కారణమని ట్రంప్ గతంలో చేసిన ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి. అయితే, భారత్ మాత్రం ఎలాంటి మూడో వ్యక్తి జోక్యం లేకుండానే కాల్పుల విరమణ జరిగిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మే 7న పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేయగా, మే 8 నుండి 10 వరకు ఇరు దేశాల మధ్య ప్రతిదాడులు జరిగాయి. చివరకు, మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) మధ్య నేరుగా ఒప్పందం కుదిరి కాల్పుల విరమణ జరిగింది. ఇందులో అమెరికా సహా ఏ మూడో వ్యక్తి జోక్యం లేదని భారత్ స్పష్టం చేసింది.
ట్రంప్ తన మధ్యవర్తిత్వ వాదనలను వెనక్కి తీసుకున్నప్పటికీ, రెండు దేశాలతో వ్యాపారం గురించి మాట్లాడినట్లు తెలిపారు. "యుద్ధం చేయకుండా వ్యాపారం చేద్దాం. దానితో పాకిస్తాన్ చాలా సంతోషించింది, ఇండియా కూడా చాలా సంతోషించింది, వారు సుమారు 1,000 సంవత్సరాలుగా పోరాడుతున్నారు" అని ఆయన దోహాలో అమెరికా దళాలకు తెలిపారు.
కాశ్మీర్ సమస్య ద్వైపాక్షికమేననీ, ఏ విదేశీ శక్తికీ పాత్ర లేదని భారత్ తన వైఖరిని కొనసాగిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో అమెరికా పాత్రపై చర్చకు దారితీశాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఇప్పటికే సుంకాల విషయంలో ప్రపంచ దేశాల నుంచి ట్రంప్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ట్రంప్ తన దేశంలో ఉన్న సమస్యలను సరిద్దిద్దుకోవాలని, తర్వాత వేరే దేశాల గురించి ఆలోచించాలని హితవు పలుకుతున్నారు. మరికొందరు ఈ వయస్సులో ఇలాంటి రిస్క్‌లు ఎందుకంటూ సెటైర్స్ వేస్తున్నారు.












Click it and Unblock the Notifications