తమిళనాడు ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్: అసెంబ్లీలో మారిన బలాబలాలు
తమిళనాడు రాజకీయాల్లో నూతన రికార్డులు సృష్టిస్తూ అధికార పీఠాన్ని దక్కించుకున్న టీవీకే తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భాగంగా ధారాపురం, మధురాంతకం నియోజకవర్గంలో విజయభేరి మోగించింది. ఈ రెండు చోట్ల కూడా టీవీకే ఏకపక్షంగా గెలిచింది. దీంతో అసెంబ్లీలో బలాబలాలు మారిపోయాయి. టీవీకే సొంతంగా మేజిక్ ఫిగర్ కు మరింత చేరువ అయింది. ఆ పార్టీ సీట్ల బలం పెరిగింది.
ఈ ఏడాది మే లో టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికలు ఇవే కావడంతో వీటి ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది. మధురాంతకంలో గానీ, ధారాపురంలో గానీ కౌంటింగ్ ప్రారంభం నుంచే టీవీకే ఆధిక్యత కనిపించింది. ప్రారంభంలో ఒకట్రెండు రౌండ్ లల్లో టీవీకే వెనుకంజలో ఉన్నా.. అది తాత్కాలికమే అయింది. ముఖ్యమంత్రి విజయ్ ప్రభంజనం ముందు డీఎంకే గానీ, ఏఐఏడీఎంకే గానీ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి.

ధారాపురం, మధురాంతకం నియోజకవర్గాలు రెండు కూడా ఏఐఏడీఎంకేకు చెందినవి. ఈ ఏడాది మే నాటి ఎన్నికల్లో ఈ రెండు చోట్లా ఆ పార్టీ అభ్యర్థులు సత్యభామ, మరగతం కుమారవేళ్ గెలిచారు. శాసనసభలో బలపరీక్ష సందర్భంగా వీరిద్దరూ కూడా విజయ్ కు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత తమ పదవులకు రాజీనామా చేసి, టీవీకేలో చేరారు. దీంతో ఉప ఎన్నికలు అవసరం అయ్యాయి. ఈ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.
ధారాపురంలో టీవీకే అభ్యర్థి పీ సత్యభామ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, డీఎంకేకు చెందిన సుగణ్యపై ఆమె 9,471 ఓట్ల స్పష్టమైన ఆధిక్యతతో గెలిచారు. ఆమెకు మొత్తం 66,841 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక్కడ డీఎంకే రెండో స్థానంలో నిలిచింది. ఏఐఏడీఎంకే మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డీఎంకే అభ్యర్థి సుగణ్యకు 57,370 ఓట్లు పడ్డాయి. ఏఐఏడీఎంకే అభ్యర్థి భానుమతి 45,280 ఓట్లు పోల్ అయ్యాయి. ఆమె మూడో స్థానానికి పడిపోయారు. మిగిలిన పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కలేదు.
మధురాంతకంలో కూడా టీవీకే ఆధిపత్యానికి ఎదురులేకుండా పోయింది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మరగతం కుమారవేళ్ చివరి రౌండ్ లో ఏకంగా 18,000 ఓట్ల ఆధిక్యతను కనపర్చారు. ఇక్కడ ఆమె గెలుపు లాంఛనప్రాయమే అయింది. కుమారవేళ్ కు 72,103 ఓట్లు పోల్ అయ్యాయి. డీఎంకే- 51,801, ఏఐఏడీఎంకే- 46,034, ఎన్టీకే- 2,083, సీపీఎం- 1,506 ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా ఏఐఏడీఎంకే మూడో స్థానానికి పరిమితమైంది.












Click it and Unblock the Notifications
