ట్విట్టర్ సంచలన నిర్ణయం... ప్రసార భారతి సీఈవో సహా 250 ఖాతాలు బ్లాక్... కారణమిదే...
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 250 మంది ట్విట్టర్ యూజర్ల ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ జాబితాలో ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి ట్విట్టర్ ఖాతా కూడా ఉండటం గమనార్హం. ట్విట్టర్ చర్యకు కారణమేంటో చెప్పాలని ట్వీట్ చేసిన ప్రసార భారతి... ఆ తర్వాత కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని భారత అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర వర్గాల ఫిర్యాదు మేరకే...
కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం... ఫేక్,రెచ్చగొట్టడం,బెదిరింపు ధోరణిలతో కూడిన హాష్ ట్యాగ్స్‌ను ఉపయోగిస్తున్న 250 ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా కేంద్ర ఐటీ,ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. #ModiPlanningFarmerGenocide(రైతుల మారణహోమానికి మోదీ ప్లాన్) అనే హాష్ ట్యాగ్‌ను ఈ ట్విట్టర్ ఖాతాల్లో ఉపయోగించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.రైతుల ఆందోళన దృష్ట్యా ఇలాంటి ప్రచారం ద్వారా దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా కోరింది. ఈ నేపథ్యంలోనే సోమవారం(ఫిబ్రవరి 1) ఆ ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసింది.

ఖండించిన బీజేపీ ఎంపీ...
మరోవైపు ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయడాన్ని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఖండించారు. హాష్ ట్యాగ్స్‌తో ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారంపై సరైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినవారినే బాధితులను చేయడం సరికాదన్నారు. 'కృత్రిమ మేధస్సు ఎంత కృత్రిమమైనదో ఈ చర్యతో అర్థమవుతోంది. రియల్ ఇంటలిజెన్స్ మిస్సయితే ఏం జరుగుతుందో కూడా దీని ద్వారా స్పష్టమవుతోంది.' అని ఆమె వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ వివరణ...
'చాలా దేశాలలో ట్వీట్లు లేదా ట్విట్టర్ ఖాతా కంటెంట్‌కు వర్తించే చట్టాలు ఉన్నాయి. మా సేవలను ప్రతిచోటా ప్రజలకు అందుబాటులో ఉంచడానికి మా నిరంతర ప్రయత్నంలో భాగంగా... అధికారిక సంస్థల నుంచి వచ్చే సరైన అభ్యర్థనలను మేము స్వీకరిస్తాం. ఆ కంటెంట్‌ను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటానికి పారదర్శకత చాలా ముఖ్యమైనది. కంటెంట్‌ను నిలిపివేయమని అభ్యర్థనలు అందిన అనంతరం ప్రభావిత ఖాతాదారులకు ఆ సమాచారాన్ని వెంటనే తెలియజేస్తాం.' అని ట్విట్టర్ స్పష్టం చేసింది.