Union Budget 2021: నిర్మలమ్మ బడ్జెట్ డాక్యుమెంట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22కు సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందరినీ ఆకట్టుకునే బడ్జెట్ కాకపోయినప్పటికీ... బడ్జెట్‌ను మమ అనిపించేశారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాలకు మాత్రం బడ్జెట్‌లో మంచి కేటాయింపులు జరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి పేపర్ రహిత బడ్జెట్ కావడం, ప్రతి అంశాన్ని చాలా వివరంగా వివరించలేకపోయారు నిర్మలా సీతారామన్. అయితే అన్ని అంశాలకు సంబంధించి పూర్తి వివరణ కలిగిన బడ్జెట్ డాక్యుమెంట్ కోసం చాలామంది చూస్తున్నారు. అది ఎక్కడ దొరుకుతుందో ఇంటర్నెట్ పై సెర్చ్ చేస్తున్నారు.
గతవారం హల్వా వేడుక సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ యాప్‌ను ఆవిష్కరించారు.ఈ సారి బడ్జెట్ పూర్తిగా పేపర్ రహిత బడ్జెట్‌గా ఉన్నందున దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ యాప్ ద్వారా పొందొచ్చు. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ ఫాంలపై ఈ యాప్ అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నట్లయితే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే పూర్తి వివరాలు అందులో ఉంటాయి. ఈ యాప్‌ను www.indiabudget.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది అధికారిక బడ్జెట్ సైట్‌లో పొందుపర్చబడింది.

లింక్ పై క్లిక్ చేయగానే గూగుల్ ప్లేస్టోర్‌పై ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ లేదా ఎలాంటి రిజిస్ట్రేషన్ వివరాలు అక్కర్లేదు. ఈ యాప్ మనకు ఇంగ్లీష్ మరియు హిందీలో అందుబాటులో ఉంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్‌ను రూపొందించింది. ఇక నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ డాక్యుమెంట్లు ఈ యాప్‌లో పొందుపర్చడం జరిగింది. ఇందులో ఆర్థికశాఖ మంత్రి ప్రసంగం, వార్షిక ఆర్థిక స్టేట్‌మెంట్, గ్రాంట్ల డిమాండ్లు, ఫైనాన్స్ బిల్ వంటివాటితో పాటు బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలతో కూడిన డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇక యాప్ నుంచి డాక్యుమెంట్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.పీడీఎఫ్ ఫార్మాట్‌లో వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.