Economic Survey 2023: వృద్ధి రేటు అంతంతే- వచ్చే ఏడాది కూడా..!!
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఊహించినట్టే దేశ జీడీపీ వృద్ధి రేటు పరిమితంగానే అంచనా వేసిందీ సర్వే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6-6.8 శాతం వరకు జీడీపీ వృద్ధి రేటు ఉండొచ్చని పేర్కొంది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ఆరంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తోన్నారు. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఈ సమావేశాలను ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమరానికి సన్నద్ధమౌతోన్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను ప్రధాన అస్త్రాలుగా మలచుకుంటోన్నాయి.

రేపే బడ్జెట్..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్- ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రతిపాదనలకు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే సంవత్సరం సార్వత్రిక పోరు ఉన్న నేపథ్యంలో- ప్రస్తుతం అందరి దృష్టీ.. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనలపైనే నిలిచింది. ఎలాంటి తాయిలాలను ప్రకటిస్తారనేది ఉత్కంఠత రేపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే క్రమంలో అనేక రకాలుగా భారం మోపినప్పటికీ- ఈ దఫా అలాంటి చర్యలు తీసుకోకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఆర్థిక సర్వే..
దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే అత్యంత కీలకమైన ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే సభలో ప్రవేశపెట్టింది. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ముగిసిన అనంతరం నిర్మల సీతారామన్- ఆర్థిక సర్వేను టేబుల్ చేశారు. కేంద్ర ఎకనమిక్ డివిజన్ ఈ సర్వే నివేదికను రూపొందించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుందీ విభాగం. ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ పర్యవేక్షణలో ఎకనమిక సర్వే రిపోర్ట్ రూపుదిద్దుకుంది.

ఆర్థిక ప్రగతి ఎలా ఉండబోతోంది..?
ఈ ఎకనమిక్ సర్వే ద్వారా 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ ప్రగతి ఎలా ఉండబోతోందనే విషయం మీదా ఓ స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక అంచనాలను ఆశించినంత గొప్గా ఏమీ లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 నుంచి 6.8 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వేసిన అంచనాల కంటే ఇది చాలా తక్కువ.

2022లో ఇలా..
2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటును కేంద్ర ప్రభుత్వం 8.0-8.5 శాతంగా అంచనా వేసింది. వాస్తవానికి ఇది ఏడు శాతానికి చేరుకోవడం కష్టతరమౌతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగనేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఈ నెల మొదట్లోనే దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7 శాతంగా నమోదవుతుందని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరాని వేసిన అంచనాలు 6 నుంచి 6.8 శాతం వరకు మాత్రమే ఉంటుందని ఆర్థిక సర్వే తేటతెల్లం చేసింది.












Click it and Unblock the Notifications