Union Budget 2025:మాల్దీవులకు రూ.600 కోట్లు, నేపాల్ కు రూ.700 కోట్లు.. ఏ దేశానికి ఎంత కేటాయించారంటే?
Union Budget 2025: దేశంలోని ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి వచ్చే ఆదాయాన్ని కేవలం దేశ అభివృద్ధికి, ప్రాజెక్టులకు కేటాయించడమే కాకుండా ఇరుగు పొరుగు దేశాలకు కూడా సాయం చేయడం భారత్ కొన్ని ఏళ్లుగా అనుసరిస్తున్న విధానం. చిన్నా చితకా దేశాలకు భారత్ సాయం చేస్తూనే ఉంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మిత్రదేశాలకు ఇండియా సాయం అందిస్తూనే ఉంది. మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు ఎన్నికైన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం నెలకొన్ని విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత కేంద్ర బడ్జెట్ లో మాల్దీవులకు ఇండియా పెద్దపీట వేసింది. గతంలో కంటే ఎక్కువ నిధులను ఈ బడ్జెట్ లో కేటాయించారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మాల్దీవులకు రూ.600 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం కేటాయించిన రూ. 470 కోట్ల కంటే 28 శాతం ఎక్కువ. మొత్తంగా విదేశీ సహాయాల కోసం రూ.5,483 కోట్లను బడ్జెట్ లో కేటాయించారు. గత బడ్జెట్ లో రూ. 5,806 కోట్లు ఉండగా.. ఈ సారి స్వల్పంగా తగ్గించారు.
గతేడాది మాల్దీవులకు ఎందుకు తగ్గించారు?
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత మాల్దీవుల బడ్జెట్‌ను రూ.400 కోట్లకు తగ్గించారు. అనంతరం దానిని రూ.470 కోట్లకు సవరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత కొంతమంది మాల్దీవుల నాయకులు ఆయనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ తగ్గింపు వచ్చింది. ప్రధాని మోదీ పర్యటన ఉద్దేశ్యం లక్షద్వీప్‌కు పర్యాటకులను ఆకర్షించడమేనని, ఇది మాల్దీవుల పర్యాటక పరిశ్రమను ప్రభావితం చేసి ఉండే అవకాశం ఉందని భావించారు. అయితే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు 2024 అక్టోబర్‌లో ఇండియాను సందర్శించిన అనంతరం సంబంధాలు మెరుగుపడ్డాయి. భారత వ్యతిరేక ప్రచారంతో మాల్దీవుల్లో అధికారంలోకి వచ్చిన ముయిజ్జు.. ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని అంగీకరించారు. ఈ క్రమంలోనే భారత్ బడ్జెట్ ను ఆ సమయంలో పెంచింది.

ఏ దేశాలకు ఎంత?
భారతదేశ పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత అనే విధానం కింద, భూటాన్‌కు గరిష్టంగా రూ.2,150 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. దీని తరువాత, నేపాల్‌కు రూ.700 కోట్లు, ఆ తర్వాత మాల్దీవులకు రూ.600 కోట్లు, మారిషస్‌కు రూ.500 కోట్లు సహాయాన్ని ప్రకటించారు. మారిషస్ బడ్జెట్ గత సంవత్సరం రూ.576 కోట్ల నుంచి తగ్గించబడింది.మయన్మార్ బడ్జెట్‌ను రూ.400 కోట్ల నుంచి రూ.350 కోట్లకు తగ్గించారు, బంగ్లాదేశ్, శ్రీలంకలకు సహాయ మొత్తంలో ఎటువంటి మార్పు లేదు. ఆఫ్రికన్ దేశాలకు సహాయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.225 కోట్లకు పెంచారు. తాలిబన్ రాజ్యమైన ఆఫ్ఘనిస్తాన్ కు గతేడాది రూ.50 కోట్లు కేటాయించగా.. ఈ సారి దానిని రూ.100 కోట్లకు పెంచారు. రెండేళ్ల క్రితం మంజూరు చేసిన రూ.207 కోట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ.












Click it and Unblock the Notifications