కేంద్ర కేబినెట్‌లో భారీ ప్రక్షాళన: కొత్త మంత్రులు ఎవరు?-వీరికి ఉద్వాసన తప్పదా?
కేంద్ర మంత్రివర్గంలో (Union Cabinet) భారీ మార్పులకు రంగం సిద్ధమవుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఈ మార్పులు, చేర్పులు ఉంటాయని భావించినా ప్రధాని మోడీ బీజీ షెడ్యూల్ కారణంగా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ప్రధాని మోడీ జాబితాను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా యువత, ప్రాంతీయ సమతౌల్యత, అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లభించనున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ ఇప్పటికే జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో హర్ష్ మల్హోత్రా, పంకజ్ చౌదరి వంటి వారిని ఢిల్లీ, యూపీ రాష్ట్ర శాఖలకు అధ్యక్షులుగా నియమించారు. అలాగే సీనియర్ మంత్రి పీయూష్ గోయల్ ను సైతం బీజేపీ కోశాధికారిగా నియమించారు. దీంతో ఈ మంత్రుల స్ధానాలు ఖాళీ అయినట్లేనని భావిస్తున్నారు. వీరు కాకుండా ఇప్పటికే రాజ్యసభ పదవీకాలం ముగిసిన జార్జి కురియన్, రవ్ నీత్ సింగ్ బిట్టూలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈ నవంబర్ లో పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరీ పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో ఆయన్నూ తప్పించే అవకాశం ఉంది. ఇలా కేబినెట్లో 12 ఖాళీలు రాబోతున్నాయి. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ జరగనుంది.

ఈసారి కేబినెట్ విస్తరణలో యువతకు, మహిళలకు మరింత ప్రాధాన్యత లభించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడు అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాల్లో పార్టీ పునాదిని పటిష్టం చేసుకునేందుకు ఆయా రాష్ట్రాల నేతలకు ప్రాతినిధ్యం లభించనుంది. మహారాష్ట్ర నుంచి శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండేను తీసుకోనున్నారు. ప్రస్తుతం అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి వంటి దాదాపు 14 మంది కీలక మంత్రులు ఒకటి కంటే ఎక్కువ శాఖల బాధ్యతలను మోస్తున్నారు. ఈ భారాన్ని తగ్గించేందుకు కొన్ని శాఖలను కొత్తగా చేరే వారికి బదిలీ చేసే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications