పౌల్ట్రీకి భారీ ఊరట: బర్డ్ ఫ్లూ మహమ్మారికి కేంద్రం బిగ్ చెక్- ఎల్లుండే..!!
బర్డ్ ఫ్లూ మహమ్మారికి కేంద్రం చెక్ పెట్టబోతోంది. ఈ ప్రమాదకర వైరస్ బారి నుంచి పౌల్ట్రీని రక్షించడానికి నూతన వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. ఈ నెల 20వ తేదీన దీన్ని జాతికి అంకితం చేయనుంది. బర్డ్ ఫ్లూ నుంచి కోళ్ల పరిశ్రమను కాపాడటానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి టీకా ఇది. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఐసీఏఆర - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ దీన్ని అభివృద్ధి చేసింది.
ఇన్‌యాక్టివేటెడ్ హెచ్5ఎన్1 (క్లాడ్ 2.3.2.1ఏ) హైలీ పాథజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా' వ్యాక్సిన్‌ను ఐసీఏఆర్ అభివృద్ధి చేసింది. ఈ టీకాను కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌లో ఆవిష్కరించనున్నారు. దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటివరకు దేశంలో కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ కేసుల్లో అత్యధికం హెచ్5ఎన్1 వైరస్‌లోని క్లేడ్ 2.3.2.1ఏ స్ట్రెయిన్‌కు చెందినవే. ఈ రకం వైరస్ కేసులే దేశంలో అత్యధికంగా నమోదవుతున్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయంగా కూడా ఈ స్ట్రెయిన్‌ను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఎలాంటి వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. దీంతో ఐసీఏఆర్ దీన్ని డెవలప్ చేసింది. హై- ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ కోళ్లకు సోకినప్పుడు వ్యాధి తీవ్రత పెరిగి దాదాపు 100 శాతం వరకు మరణాలు సంభవిస్తాయనే విషయం తెలిసిందే. వైరస్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అరికట్టడానికి కోళ్లను సామూహిక సమాధి చేయాల్సి వస్తోంది. దీనివల్ల పౌల్ట్రీ రైతులకు తీరని నష్టం వాటిల్లడాన్ని మనం చూస్తోంటాం.
ఒకవేళ బర్డ్ ఫ్లూ అదుపు తప్పి విస్తృతంగా వ్యాపిస్తే.. దేశంలోని మొత్తం కోళ్లల్లో 20 శాతానికి పైగా నాశనం అయ్యే తీవ్ర ప్రమాదం ఉంది. దీని ప్రభావం స్థూల జాతీయోత్పత్తి వృద్ధిని సైతం దెబ్బకొడుతుంది. దాదాపు 1.5 శాతం వరకు జీడీపీ తగ్గించే అవకాశం ఉంటుంది. 2006లో సంభవించిన బర్డ్ ఫ్లూ వల్ల దేశంలో దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు ప్రత్యక్ష, పరోక్ష నష్టం వాటిల్లిన విసయం తెలలిసిందే. అప్పట్లో మణిపూర్‌లో తలెత్తిన ఈ బర్డ్ ఫ్లూ ఆ రాష్ట్ర జీడీపీలో 0.5 శాతానికి సమానమైన నష్టాన్ని మిగల్చడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
బర్డ్ ఫ్లూ కోళ్లు, ఇతర పక్షులకే కాకుండా ప్రజారోగ్యానికి కూడా సవాల్ గా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2003 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలలో 1,003 మందికి హెచ్5ఎన్1 సోకింది. వీరిలో 479 మంది మరణించారు కూడా. క్లాడ్ 2.3.2.1ఏ వైరస్ ఇటీవల కొన్ని క్షీరదాలు, అలాగే మనుషులకు కూడా సోకినట్లు తేలింది.
కోళ్ల నుంచి ఇతర జంతువులు, మనుషులకు ఈ వైరస్ సంక్రమించకుండా అడ్డుకోవడానికి రూపొందించిన ఈ టీకా కీలక పాత్ర పోషించనుంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పౌల్ట్రీ పరిశ్రమలో స్థిరత్వం ఏర్పడుతుందనే అంచనాలు ఉన్నాయి. కోడిమాంసం, గుడ్ల ధరల పెరుగుదలను కూడా అరికట్టవచ్చని చెబుతున్నారు.













Click it and Unblock the Notifications
