రామ్ నే యాదవ్ కో మారా..: యూపీ ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు
ఉత్తర ప్రదేశ్ శాసనమండలి ఎన్నికల ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అనేక తప్పులు చోటు చేసుకున్నాయి. ఓటర్ల పేర్ల స్థానంలో వింత వాక్యాలు, తండ్రి పేరు నమోదు చేయాల్సిన చోట విద్యార్హతలు ముద్రితం కావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో తాజా పరిణామాలు చోటు చేసుకోవడం అటు రాజకీయంగా కూడా వివాదానికి కేంద్ర బిందువైంది.
ఈ అంశంపై ఎన్నికల యంత్రాంగం తక్షణమే స్పందించింది. స్పష్టత ఇచ్చింది. సాంకేతిక లోపాల కారణంగానే ఈ పొరపాట్లు చోటు చేసుకున్నాయని వివరించింది. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా చూస్తామని పేర్కొంది. ఇప్పటికే సర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ, ఇండియా బ్లాక్ ఉద్యమాలు చేపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ లో ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అలహాబాద్-ఝాన్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో ఇటువంటి అసాధారణ వివరాలు వెలుగులోకి వచ్చాయి. రామ్‌హిత్ యాదవ్ అనే ఓటరు పేరు ఆంగ్లం నుండి హిందీలోకి మారే క్రమంలో ట్రూ ట్రాన్స్ లేషన్ జరిగింది. రామ్ నే యాదవ్ కో మారా అని ఓటర్ల జాబితాలో పబ్లిష్ అయింది. మరో ఓటర్ తండ్రి పేరు స్థానంలో ఏకంగా అతని విద్యార్హత ప్రచురితమైంది. తండ్రి పేరు ఉండాల్సిన చోట బీకామ్ అనే అక్షరాలు కనిపించాయి.
ఈ పరిణామాలపై ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా మీడియాతో మాట్లాడారు. 11 నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 14.81 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 158 పేర్లు చోట్ల ఇటువంటి పొరపాట్లు దొర్లాయని తెలిపారు. శాసనమండలిలోని అయిదు పట్టభద్రులు, ఆరు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను మొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో సిద్ధం చేశామని, ఈ క్రమంలో ఈ లోపాలు సంభవించాయని వివరించారు.
2016 లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఓటర్లు ఇంటి నుంచే సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈ నూతన డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. దీంతో హిందీలో ఉండే పేర్లను ఇంగ్లీష్ లోకి అనువదించే సమయంలో అవి యధాతథంగా ట్రాన్స్ లేట్ అయ్యాయి. రామ్‌హిత్ యాదవ్ అనే పేరు రామ్ హిట్ యాదవ్.. గా మారింది. అది మళ్లీ హిందీలోకి తర్జుమా కావడం వల్ల రామ్ నే యాదవ్ కో మారా లాంటి వాక్యాలు ప్రచురితం అయ్యాయి.
దీనిపై రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేశాయి. దీనిపై కమిషనర్ విమల్ కుమార్ దూబే సమగ్ర విచారణకు ఆదేశించారు. టైపింగ్ గానీ, ప్రింటింగ్ లోపాల కారణంగా అర్హులైన ఓటర్లను ఓటింగ్ ప్రక్రియ నుంచి అడ్డుకోకూడదని జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఓటర్ల జాబితాలో దొర్లిన క్లెరికల్ పొరపాట్ల వల్ల ఏ ఓటరునైనా ఓటింగ్ కేంద్రం నుంచి వెనక్కి పంపితే సంబంధిత జిల్లాల కలెక్టర్లనే ప్రత్యక్షంగా బాధ్యులను చేస్తామని సీఈఓ హెచ్చరించారు.














Click it and Unblock the Notifications
