బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మకండి; కరోనా మరణాలపై యోగిని టార్గెట్ చేసిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మమతా బెనర్జీ బిజెపి వాగ్దానాలకు పడిపోవద్దని, వారి మాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
Recommended Video

బీజేపీ నేతలు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మొద్దు: మమతా బెనర్జీ
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, "సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ఇవ్వాలని మరియు వారిని గెలిపించాలని, బిజెపిని ఓడించాలని తాను అందరినీ కోరుతున్నానని పేర్కొన్నారు. బీజేపీ చేస్తున్న తప్పుడు వాగ్దానాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మమతా బెనర్జీ .మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిని కూడా సందర్శిస్తానని మమతా బెనర్జీ తెలిపారు. బీజేపీ నేతలు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మొద్దని దీదీ యూపీ ప్రజలను కోరారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై మాటల దాడి చేసిన దీదీ
ఇదే సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనావైరస్ మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై మాటల దాడి చేశారు. యుపిలో కోవిడ్ కారణంగా ప్రజలు చనిపోతున్నప్పుడు యోగీ గారు మీరు ఎక్కడ ఉన్నారు? మృతదేహాలను గంగలో పడేసిన వారి కుటుంబాలకు మీరు క్షమాపణ చెప్పాలి? మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి" అని మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో యోగి ఆదిత్యనాథ్ ను టార్గెట్ చేశారు. యూపీలో బీజేపీని ఓడించి అఖిలేష్ యాదవ్ గెలవాలని కోరుకుంటున్నాం అంటూ మమతా బెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ విజయంపై అఖిలేష్ వ్యాఖ్యలు
ఇక ఇదే సమయంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీపై మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ లో అధికారం కోసం బిజెపి శతవిధాలా ప్రయత్నం చేసిందని, పశ్చిమ బెంగాల్‌లో పార్టీ తన మొత్తం శక్తి యుక్తులను ప్రదర్శించిందని , అయినప్పటికీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించడంలో విఫలమైందని ఎస్‌పి చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. మమతా బెనర్జీ సత్యమేవ జయతే ని ఉదాహరణగా చూపారని, అన్ని మతతత్వ శక్తులను ఓడించటానికి పనిచేశారని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.

బిజెపి అబద్ధాల విమానం ఈసారి యూపీలో దిగదన్న అఖిలేష్
వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బీజేపీ నేతలు యూపీ పర్యటనను రద్దు చేసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ పై అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మమతా బెనర్జీ కలకత్తా నుండి లక్నో కి వచ్చారు కానీ, బిజెపి నేతలు ఢిల్లీ నుంచి యూపీ కి రాలేకపోయారు అంటూ ఎద్దేవా చేశారు. బిజెపి అబద్ధాల విమానం ఈసారి యూపీలో దిగదు అంటూ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ పై సమరశంఖం పూరిస్తున్న మమతా బెనర్జీ మొదటి నుండి ఎస్పీకి అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా నిలిచారు. అందుకే యూపీలో ఎన్నికల బరిలో ఉండటం లేదని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆదరిస్తే ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ విజయం సాధిస్తారని మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications