uttar pradesh rape minor girl yogi adityanath murder ఉత్తరప్రదేశ్ రేప్ అత్యాచారం యోగి ఆదిత్యనాథ్ హత్య
మంచినీళ్లు అడిగిన పాపానికి... మైనర్ బాలికపై అత్యాచారం,హత్య.. యూపీలో మరో దారుణం..
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు నిత్యకృత్యమైపోయాయి. రాష్ట్రంలో ప్రతీరోజూ ఎక్కడో చోట అత్యాచార సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా బులంద్‌షహర్ జిల్లాలో ఓ మైనర్ బాలిక హత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దాహం వేస్తోందని నీళ్లడిగిన పాపానికి ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఆపై తన ఇంటి ఆవరణలోనే గుంత తవ్వి పాతిపెట్టాడు. బాలిక అదృశ్యమైన ఆరు రోజులకు ఈ విషయం బయటపడింది. కనిపించకుండా పోయిన కూతురు శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అసలేం జరిగింది...
బులంద్‌షహర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక(14) తన తల్లిదండ్రులతో పాటు పొలం పనులకు వెళ్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటోంది. చిన్నతనం నుంచే గొంతు సమస్య కారణంగా ఆమె స్పష్టంగా మాట్లాడలేదు. గత గురువారం(మార్చి 25) ఎప్పటిలాగే తన తల్లి,సోదరితో కలిసి పొలం పనికి వెళ్లింది. ఎండలో చాలాసేపు పనిచేశాక ఆమెకు తీవ్ర దాహమైంది. దగ్గరలో నీళ్లు లేకపోవడంతో ఇక ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా ఇంటికి బయలుదేరిన ఆ బాలిక ఆరు రోజులుగా కనిపించకుండా పోయింది.

ఇలా బయటపడింది...
తమ కూతురు ఎక్కడికి వెళ్లిందో... ఏమైందో తెలియక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పోలీసులు రంగంలోకి దిగాక ఈ కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి. ఆ కుటుంబానికి చెందిన పొలానికి సమీపంలో హరేంద్ర(22) అనే యువకుడి ఇల్లు ఉంది. పోలీసులకు హరేంద్రపై అనుమానం వచ్చి అతన్ని విచారించాలనుకున్నారు. ఇందుకోసం అతని ఇంటికి వెళ్లగా తలుపుకు తాళం వేసి కనిపించింది. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. అదే ఇంటి ఆవరణలో కాంపౌండ్ గోడను ఆనుకుని ఒక మట్టి కుప్ప కనిపించింది.

సిమ్లాలో పట్టుబడ్డ నిందితుడు
దగ్గరికి దాన్ని పరిశీలించగా... గుంత తవ్వి మట్టి కప్పినట్లుగా అర్థమైంది. దీంతో పోలీసులు వెంటనే ఆ మట్టిని తొలగించి చూడగా... అందులో బాలిక మృతదేహం బయటపడింది. హరేంద్రనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని నిర్దారించిన పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలించారు. ఎట్టకేలకు బుధవారం(మార్చి 3) అతను పట్టుబడ్డాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించిన అతను... ఆరోజు అసలేం జరిగిందో పోలీసులకు వివరించాడు.

మంచినీళ్లు అడిగిన పాపానికి....
నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం... పొలం పనులు చేసి అలసిపోయిన ఆ బాలిక దాహం వేయడంతో ఇంటికి బయలుదేరింది. అయితే అక్కడికి హరేంద్ర ఇల్లు దగ్గరగా ఉండటం,తెలిసినవాళ్లు కావడంతో ఆ ఇంటికి వెళ్లి మంచినీళ్లు ఇవ్వాలని అడిగింది. ఇదే అదనుగా హరేంద్ర ఆమెను లోపలికి పిలిచి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో బలంగా గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఇంటి ఆవరణలోనే గోడ పక్కన గుంత తవ్వి పూడ్చి పెట్టాడు. ఆపై ఇంటికి తాళం వేసి గ్రామం నుంచి పరారయ్యాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.