ఏడుగురు పిల్లల తండ్రికి భార్యను అమ్మేయబోయాడు
బరెల్లీ (ఉత్తరప్రదేశ్) : పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ యువతిపై అత్యాచారానికి తెగబడ్డ వ్యక్తి.. పెళ్లి మాటెత్తేసరికి మాత్రం ఛీదరించుకున్నాడు. ఆపై కుల పెద్దల ఒత్తిడితో ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న ఆ యువతి.. పెళ్లయిన తర్వాత ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డపై అతనికి ఏమాత్రం ప్రేమ లేకపోగా.. రూ.25వేలకు మరో జంటకు ఆ బిడ్డను అమ్మేశాడు.
అనంతరం భార్యను సైతం వేధించుకు తినడం మొదలుపెట్టాడు. ఏడుగురు పిల్లలున్న ఓ వయసు మళ్లిన వ్యక్తికి తన భార్యను అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఇంటినుంచి పారిపోయి బయటకొచ్చిన యువతి.. స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులకు బాధిత మహిళ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2013లో తానో ఎంబ్రాయిడరీ డిజైనర్ గా పనిచేస్తున్న తనకు షావెజ్ తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య కొంతకాలానికి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ క్రమంలో షావెజ్ తరుచూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. అలా.. ఓరోజు తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, ఆమెను లోబర్చుకున్నాడు. తీరా.. ఆమె ప్రెగ్నెంట్ అని తేలడంతో.. తన గురించి బయట ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగాడు.

ఈ నేపథ్యంలోనే.. విషయం కులపెద్దలకు తెలియడంతో.. పంచాయితీ నిర్వహించిన కులపెద్దలు.. బలవంతంగానే షావెజ్ ను పెళ్లికి ఒప్పించారు. పెళ్లయ్యాక పాప పుట్టడంతో.. పాపను వద్దనుకున్న షావెజ్ రూ.25వేలకు మరో జంటకు అమ్మేశాడు. అనంతరం ఓ ఏడుగురు పిల్లల తండ్రితో ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని చూశాడు. విడాకుల కోసం డిమాండ్ చేశాడు. ఇలా వేధింపులను ఎదుర్కొంటున్న క్రమంలో.. బాధిత మహిళ ఇంటినుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించింది.
బాధిత మహిళ ఫిర్యాదు మేరకు షావెజ్ పై ఐపీసీ సెక్షన్-376 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. దీంతో కాళ్లబేరానికి వచ్చిన షావెజ్ బాధితమహిళతో సామరస్యక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక్కడితో అంతా అయిపోయిందని భావించినా.. మళ్లీ అతగాడు ఆమెను మోసం చేయడానికి ప్రయత్నించడంతో.. మరోసారి పోలీసులను ఆశ్రయించింది బాధిత మహిళ. కేసులో సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని, బిడ్డను దూరం చేసుకుని మూడేళ్లుగా బాధపడుతున్నానని తన బిడ్డను తనకు తిరిగి తెచ్చివ్వాలని బాధిత మహిళ కోరుతోంది. ప్రస్తుతం ఆ మహిళ విడాకులు తీసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications